
భివానీ: పహల్గాం ఉగ్ర దాడిపై బీజేపీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. మంత్రుల స్థాయి నేతలే మతిలేని వ్యాఖ్యలు చేసి కోర్టులతో మొట్టికాయలు తింటున్నా కనువిప్పు కలగడం లేదు. పహల్గాం దాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బీజేపీ ఎంపీ రాంచందర్ జంగ్రా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది. కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగ్నివీరుల్లాగా వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’ అంటూ కామెంట్స్ చేశారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్ నేతలు దీపీందర్‌సింగ్ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు మండిపడ్డారు.
महिलाओं का उपहास उड़ाना तो बीजेपी का कर्म और धर्म दोनों बन चुका है।
इसी क्रम में भाजपा के सांसद रामचंद्र जांगरा देश के गृहमंत्री की विफलता का ठीकरा शहीदों की पत्नी के सिर फोड़ना चाह रहे हैं।
उनका कहना है कि उन महिलाओं को भी साथ में शहीद हो जाना चाहिए था।
pic.twitter.com/vL2x97ePQU— Uttar Pradesh Congress Sevadal (@SevadalUTP) May 25, 2025
ఇదిలా ఉండగా.. ఇటీవలే భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విజయ్ షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్ నేతలు ప్రధానికి విజ్ఞప్తిచేశారు. అనంతరం, జరిగిన పరిణామాల తర్వాత సదరు మంత్రి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అది ‘భాషా పరమైన తప్పిదమే’ తప్ప ఏ మతాన్నీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్ ఆర్మీకి, సోదరి కర్నల్ సోఫియా ఖురేషీకి, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు.