‘ఉమ్మడి స్మృతి’పై రాజ్యసభలో ప్రైవేట్‌ బిల్లు | BJP MP Private Member Bill On Uniform Civil Code In The Rajya Sabha | Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి స్మృతి’పై రాజ్యసభలో ప్రైవేట్‌ బిల్లు.. విపక్షాల ఆందోళన

Dec 10 2022 7:56 AM | Updated on Dec 10 2022 7:56 AM

BJP MP Private Member Bill On Uniform Civil Code In The Rajya Sabha - Sakshi

ఉమ్మడి స్మృతి దేశ సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తుందంటూ ఆందోళన వెలిబుచ్చాయి.

న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతిని సిద్ధం చేసేందుకు ఓ ప్యానల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ వివాదాస్పద ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకొచ్చింది. విపక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరాల మధ్య బీజేపీ ఎంపీ కిరోడీలాల్‌ మీనా దీన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ తదితర విపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉమ్మడి స్మృతి దేశ సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తుందంటూ ఆందోళన వెలిబుచ్చాయి. ‘‘ఆరెస్సెస్‌ అజెండాను అమలు చేసేందుకు పాలక బీజేపీ ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌ అంశాన్ని ముగించేశారు. ఇప్పుడిక ఉమ్మడి స్మృతిపై పడ్డారు. ఈ బిల్లు పూర్తిగా అనైతికం. ప్రజా వ్యతిరేకం. రాజ్యాంగవిరుద్ధం. దీన్ని తక్షణం ఉపసంహరించాలి’’ అంటూ విపక్ష సభ్యులు ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. దాంతో చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఓటింగ్‌ నిర్వహించారు. 63–23 తేడాతో బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ నాయకుడు పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ విపక్షాల అభ్యంతరాలు, ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ఏ అంశాన్నైనా లేవనెత్తడం సభ్యుని హక్కు. ఉమ్మడి స్మృతిపై సభలో చర్చ జరగనిద్దాం’’ అని సూచించారు. ఉమ్మడి స్మృతిపై గతంలోనే బిల్లును లిస్ట్‌ చేసినా సభ దాకా రాలేదు.

గవర్నర్‌ పాత్రపై సీపీఎం బిల్లు 
గవర్నర్‌ పాత్ర, అధికారులు, విధులను స్పష్టంగా నిర్వచిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ వి.సదాశివన్‌ రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో తన అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దారుణంగా దుర్వినియోగం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ‘‘చరిత్రే ఇందుకు సాక్ష్యం. గవర్నర్‌ పదవి వలస పాలన సమయంలో భారతీయులను అణచేసేందుకు సృష్టించినది. గవర్నర్లు చాలావరకు ఇప్పటికీ అదే వలసవాద భావజాలంతో పని చేస్తున్నారు’’ అని విమర్శించారు. గవర్నర్‌ను కేంద్రమే నియమించేట్టయితే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడు పేర్లు ప్రతిపాదించి ఆయన సూచన మేరకు నడచుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement