Manipur violence: BJP MLA Vungzagin Valte attacked by mob in Imphal, critical - Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో హైటెన్షన్‌.. మంత్రిపై దాడి.. రైళ్లు బంద్‌

May 5 2023 11:25 AM | Updated on May 5 2023 11:46 AM

BJP MLA Vungzagin Valte Attacked By Mob In Manipur Imphal - Sakshi

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తమకు షెడ్యూల్డ్‌ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్‌ చేయడం అగ్గి రాజేసింది. దీంతో, గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. నిరసన సందర్భంగా రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత ఉంగ్జాగిన్‌ వాల్టేపై నిరసనకారులు దాడికిపాల్పడ్డారు. 

కాగా, నిరసనకారుల దాడిలో ఉంగ్జాగిన్‌ వాల్టే తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన వాల్టే ఇంఫాల్‌లోని రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక, ఉంగ్జాగిన్‌ వాల్టే.. కూకి తెగకు చెందిన వ్యక్తి.  వాల్టే ఫెర్జావల్‌ జిల్లాలోని థన్‌లోన్‌ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా, గురువారం సెక్రటేరియట్‌లో సీఎం బీరేన్‌ సింగ్‌తో సమావేశమై తిరిగి తన అధికార నివాసానికి వెళ్తుండగా నిరసనకారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. వాల్టేతోపాటు ఆయన డ్రైవర్‌ను విచక్షణారహితంగా కొట్టారు. కష్టంపై వాళ్లు అక్కడినుంచి బయటపడ్డారు. 

ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్‌ జవాన్లను ప్రభుత్వం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మణిపూర్‌లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్‌కు వెళ్లాల్సిన అన్ని రైళ్లను బోర్డర్‌లో నిలిపివేస్తున్నట్ట నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటీర్‌ రైల్వే వర్గాలు ట్విట్టర్‌ వేదికగా తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ఎన్సీపీ అధినేత ఎవరవుతారో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement