Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్‌.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!

Bipin Rawat Chopper Crashed Five Minutes Before Landing - Sakshi

చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయణిస్తున్న హెలికాప్టర్‌ మరో పది నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుందనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఏమిటనే అంశంపై ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్‌ విచారణకు ఆదేశించింది. అయితే గమ్యస్థానానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

ఢిల్లీ నుంచి సూలూరు
మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్యానెక్స్‌ కర్టెన్‌ రైజర్‌ సమావేశంలో బిపిన్‌ రావత్‌ పాల్గొన్నారు. బుధవారం తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో భార్యతో పాటు కలిసి ఆయన తమిళనాడు పర్యటనకు వచ్చారు. 

11:48కి టేకాఫ్‌
సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి అత్యదిక సౌకర్యాలు ఉన్న క్యారియర్‌ హెలికాప్టర్‌ ఎంఐ 17లో భార్యతో కలిసి మరో పన్నెండు మంది ఆర్మీ అధికారులతో ఆయన వెల్లింగ్టన్‌కి బయలు దేరారు. ఉదయం 11:48 నిమిషాలకు హెలికాప్టర్‌ సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది. నీలగిరి కొండల్లో విస్తరించిన దట్టమైన అడవుల గుండా ప్రయాణించి ఈ హెలికాప్టర్‌ వెల్లింగ్టన్‌ చేరుకోవాల్సి ఉంది. సూలూరు నుంచి వెల్లింగ్టన్‌ల మధ్య 94 కిలోమీటర్ల దూరం ఉంది. 

12:22కి మిస్సింగ్‌
సూలూరు నుంచి హెలికాప్టర్‌ బయల్దేరిన తర్వాత దాదాపు గమ్యస్థానం దరిదాపులకు చేరే వరకు ప్రయాణం సజావుగానే సాగింది.దాదాపు అరగంట తర్వాత ప్రయాణ మార్గంలో ఇబ్బందులు తలెత్తడంతో బేస్‌స్టేషన్‌తో సంప్రదింపులు చేశారు. చివరగా మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో బేస్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు మధ్యాహ్నం 12:27 గంటల సమయంలో హెలికాప్టర్‌ క్రాష్‌ అయినట్టుగా చెబుతున్నారు.

ఆ ఐదు నిమిషాల్లో
వెల్లింగ్టన్‌ సమీపంలో కూనూరు అటవీ ప్రాంతం సమీపంలో ప్రమాదం జరిగింది. ఇక్కడి నుంచి వెల్లింగ్టన్‌లో డిఫెన్స్‌ స్టాప్‌ కాలేజీకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పది నిమిషాలు ప్రయాణం చేస్తే హెలికాప్టర్‌ క్షేమంగా ల్యాండ్‌ అయ్యేది. కానీ మధ్యాహ్నం 12:22 గంటల నుంచి 12:27 గంటల వ్యవధిలో జరిగిన వరుస ఘటనలో హెలికాప్టర్‌ క్రాష్‌ అయ్యింది. శిథిలాలను నాంచప్ప చత్తరాం కట్టేరీ ప్రాంతంలో లభించాయి.

క్షణాల్లోనే 
మరో ఐదు పది నిమిషాల్లో ల్యాండ్‌ కావాల్సిన హెలికాప్టర్‌ క్రాష్‌ అయ్యింది. జనావాస ప్రాంతాలకు సమీపంలో ప్రమాదం జరగడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ మంటల తీవ్రత, క్రాష్‌ కారణంగా అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. హెలికాప్టర్‌లోని ప్రయాణిస్తున్న 14 మంది చనిపోయారు. ప్రమాదస్థలిలో తీవ్రంగా గాయపడిన బిపిన్‌ రావత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

చదవండి: ఘోర ప్రమాదం.. ఆర్మీ హెలికాప్టర్‌లో ప్రయాణించిన వారి వివరాలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top