సైబర్ నేరగాళ్ల మాయలో పడితే ఎంతటి అనర్థం జరుగుతుందో చెప్పే మరో విషాద ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. ఉన్నత చదువులు చదువుతున్న 22 ఏళ్ల యువతి.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని సుమారు రూ.2.5 లక్షలు కోల్పోయినట్లు పోలీసుల దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కనిపించకుండా పోయిన ఆమె.. చివరకు రైల్వే ట్రాక్ సమీపంలో విగతజీవిగా కనిపించింది. ఆమె మరణం ఆత్మహత్య అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తుండగా.. తమ కుమార్తెది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
బీహార్‌లోని పాట్నా జిల్లా కుమ్హ్రార్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శుక్రవారం యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె అక్టోబర్ 5 నుంచి కనిపించకుండా పోయినట్లు రైల్వే ఎస్పీ అనంత్ కుమార్ రాయ్ తెలిపారు. సెప్టెంబర్ నుంచే ఆమె కొందరు సైబర్ నేరగాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో బెదిరింపులకు గురిచేసి ఆమె నుంచి సుమారు రూ.2.5 లక్షలు వసూలు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్‌లోని పలు ఖాతాలకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
మరో డెడ్‌బాడీ కలకలం..
కాగా, యువతి కాల్ డేటా రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. కనీసం 10 అనుమానాస్పద ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డబ్బు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లింది? ఆమెను ఎవరైనా బెదిరించారా? మరణానికి ముందు ఏం జరిగింది? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. యువతి మృతదేహానికి సుమారు 200 మీటర్ల దూరంలో మరో వ్యక్తి మృతదేహాన్ని కూడా గుర్తించారు. అతడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రెండు మరణాల మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఆత్మహత్యా.. హత్యా?
ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా యువతి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా మరణానికి గల కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసం
డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరగాళ్లు ఉపయోగించే మోసపూరిత పద్ధతి. పోలీసులమని, సీబీఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులమని చెప్పి వీడియో కాల్స్ ద్వారా బాధితులను భయపెడతారు. కేసుల్లో ఇరికిస్తామని, అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు బదిలీ చేయిస్తారు. అయితే, చట్టబద్ధంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రక్రియ లేదు. ఇలాంటి బెదిరింపులకు గురైతే భయపడి డబ్బులు పంపకుండా, వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలి.


