బిహార్‌లో నేరాలు తగ్గాయా, పెరిగాయా?

Bihar Election 2020 : Weather Law And Order Improve In Bihar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీహార్‌ అసెంబ్లీకి మూడ విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర శాంతి భద్రతల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ‘తిరిగి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గూండా రాజ్యం కావాలా? లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎంతో మెరగుపర్చిన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం కావాలా?’ అంటూ నితీష్‌ కుమార్‌ పార్టీ అయినా జేడీయూతోపాటు దాని మిత్రపక్షమైన బీజేపీ తెగ ప్రచారం కొనసాగిస్తోంది. లాలూ ప్రసాద్‌ యాదవ్, తన భార్య రాబ్డీదేవీతో కలసి 1990 నుంచి 2005 సంవత్సరం వరకు బీహార్‌ రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత 2005 నుంచి 2014లో కొన్ని నెలలు మినహా ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్లపాటు నితీష్‌ కుమార్‌ పాలించారు. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో, ఆదివారమే ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారంలో, నవంబర్‌ ఏడవ తేదీన జరుగనున్నన మూడవ విడత ఎన్నికల ప్రచారానికి కూడా రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితే ప్రధానాంశం అయినందున నాటి లాలూ ప్రసాద్‌ హయాంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది ? నితీష్‌ కుమార్‌ హయాంలో పరిస్థితిలో మార్పు వచ్చిందా ? నిజంగా శాంతి భద్రతలు మెరగుపడిందా ? 

‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో’ డేటాను పరిశీలించడం ద్వారా ఏది వాస్తవమో, ఏదవాస్తవమో, ఏ మేరకు వాస్తవమో సులభంగానే గ్రహించవచ్చు. 2018 సంవత్సరం దేశవ్యాప్తంగా నేరాల సరాసరి సగటు రేటు లక్ష జనాభాకు 300లకు పైగా ఉండగా, బీహార్‌లో నేరాల రేటు సగటు రేటు లక్ష జనాభాకు 222.1 శాతం మాత్రమే ఉందని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కలనే ప్రస్థావించింది. 2018 సంవత్సరానికి బీహార్‌లో ఐపీసీ, ఎస్‌ఎల్‌ఎల్‌ కింద మొత్తం 2,62,815 కేసులు నమోదయ్యాయి. ఇది లక్ష జనాభాకు 222.1 శాతం సగటని చెప్పడం కూడా సబబే. అదే 2016లో 1,89,696 కేసులు, 2017లో 2,36,055 కేసులు నమోదయ్యాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉందనే అంశంతో సంబంధం లేకుండా 2001 సంవత్సరం నుంచి బీహార్‌లో ఏటేటా నమోదవుతున్న నేరాల సంఖ్య పెరగుతూనే వస్తోంది. 

నేరాల సంఖ్యలో బీహార్‌ దేశంలోనే 23వ స్థానంలో ఉందని నితీష్‌ ప్రభుత్వం చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుందని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. దేశం మొత్తంగా జరిగిన నేరాల్లో 5.2 శాతం నేరాలు ఒక్క బీహార్‌లో జరిగినవేనని, నేరాల సంఖ్య విషయంలో దేశంలో బీహార్‌ ఏడవ స్థానంలో ఉంది. లక్ష జనాభాతో పోల్చినప్పుడే అది 23వ స్థానంలో కనిపిస్తుంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన నేరాలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకున్నామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకానీ కేసులను పరిగణలోకి తీసుకోలేదని స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సబ్‌ ఇనిస్పెక్టర్‌ ఉమేశ్‌ కుమార్‌ తెలిపారు. రేప్‌లు, కులులు, మతాల మధ్య జరిగే కలహాలు, భూముల వివాదాలపై ఎక్కువగా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు కావు. బీహార్‌లో 60 శాతం నేరాలు భూ తగాదాల కారణంగానే జరగుతాయి. ఈ తగాదాల కారణంగా బీహార్‌లో 2018 సంవత్సరంలో 1,016 మంది హత్యకు గురయ్యారు. వీటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే రాష్ట్రంలో జరిగిన హత్యలు 34.6 శాతం. ఇంకా దేశంలో ఎక్కడా లేనివిధంగా జల వివాదాల కారణంగా బీహార్‌లో 44 మంది హత్యకు గురయ్యారు. 

ఇక మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో కూడా దేశంలోనే బీహార్‌ 29వ స్థానంలో ఉందని చెప్పడం కూడా ఒక విధంగా వక్రీకరించడమేనని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఇందులో 33 రేప్‌లు, 23 కిడ్నాప్‌లు, 11 హత్యలు మాత్రమే పరిగణలోకి వచ్చాయి. వాస్తవానికి వీటి విషయంలో బీహార్‌ ఎనిమిదవ స్థానంలో ఉంది. వాస్తవానికి రేప్‌ల విషయంలో బీహార్‌ రెండో స్థానంలో, కిడ్నాప్‌ల విషయంలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. 2016 నాటి గణాంకాలతో పోలిస్తే గతేడాదికి 42 శాతం పెరిగాయి. అవే హత్యలు 20 శాతం పెరిగాయి. 2016లో 2,581 హత్యలు జరగ్గా, గతేడాది 3,138 హత్యలు జరిగాయి. అలాగే 2016తో పోలిస్తే గతేడిదాకి రేప్‌లు 44 శాతం పెరిగాయి. నితీష్‌ కుమార్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2005 నుంచి 2010 మధ్యనే బీహార్‌లో నేరాలు తగ్గాయని, ఆ తర్వాత పెరగుతూనే వచ్చాయని పట్నాలో సెక్యూరిటీ సంస్థ నడుపుతున్న ఆర్‌కే కాంత్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top