Bharat Jodo Yatra: ఎన్నికలప్పుడే చెబుతా

Bharat Jodo Yatra: No confusion on Congress leadership says Rahul Gandhi - Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిపై రాహుల్‌ 

నా మైండ్‌లో గందరగోళమేమీ లేదు

నిర్ణయం తీసేసుకున్నానని వెల్లడి

కన్యాకుమారి: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్‌ గాంధీ చేపడతారా లేదా అన్న సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలోనే తాను అధ్యక్షుడిగా ఉంటానా లేదా అన్న విషయం తెలుస్తుందని రాహుల్‌ గాంధీ చెప్పారు. ఇప్పటికే దీనిపై తాను స్పష్టమైన నిర్ణయం తీసుకున్నానని, ఒకవేళ పోటీలో లేకపోతే దానికి గల కారణాలు కూడా వివరిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్‌ గాంధీ శుక్రవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపడతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘నేను నా నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నాకు ఎలాంటి గందరగోళం లేదు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడే నేను అధ్యక్షుడిని అవుతానా లేదా మీకు తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టండి. ఒకవేళ నేను పోటీలో లేకపోతే అప్పుడు మీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెబుతాను’’అని రాహుల్‌ బదులిచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి సోనియా గాంధీయే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

రాజకీయ పోరాటం కాదు  
ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం, వారితో మమేకమవడానికే పాదయాత్ర చేస్తున్నానని రాహుల్‌ స్పష్టం చేశారు. ‘‘యాత్రయ్యే పూర్తయ్యే సరికి నాపై తనకి అవగాహన పెరుగుతుంది. తెలివితేటలూ కాస్త పెరుగుతాయి’’ అని చమత్కరించారు. కాంగ్రెస్‌కూ ఎంతో కొంత లబ్ధి చేకూరితే మంచిదేనన్నారు. దేశంలో వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేస్తోందన్నారు.

రూ.41 వేల టీ షర్టు
రాహుల్‌ పాదయాత్రపై బీజేపీ విసుర్లు
న్యూఢిల్లీ: భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ఖరీదైన టీ షర్ట్‌ వేసుకున్నారంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. దాని ఖరీదు రూ.41,257 అంటూ శుక్రవారం ట్వీట్‌ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ధరించే ఖరీదైన దుస్తుల మాటేమిటంటూ కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. ‘‘మోదీ వేసుకునే రూ.10 లక్షల సూట్, రూ.1.5 లక్షల కళ్లద్దాలు గురించి కూడా బీజేపీ మాట్లాడాలి’’ అంటూ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సుప్రియ ట్వీట్‌ చేశారు. యాత్రకు లభిస్తున్న స్పందన చూసి బీజేపీ భయపడుతోందని ఆమె
ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాల ఐక్యతకు దోహదం
కన్యాకుమారి: దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు పాదయాత్ర ఉపకరిస్తుందని రాహుల్‌ గాంధీ మీడియాతో చెప్పారు. ఒకే తాటిపైకి రావడం విపక్షాల బాధ్యతన్నారు. ‘‘కాంగ్రెస్‌తో పాటు ఇందులో ప్రతి పార్టీకి ఇందులో పాత్ర ఉంది. విపక్షాల ఐక్యతపై చర్చలు సాగుతున్నాయి. కొందరు నాయకులు బీజేపీ ఒత్తిళ్లకు లొంగిపోయి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ప్రభుత్వం ప్రయోగిస్తున్న దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి దాసోహమంటున్నారు. పాత్రికేయులు సైతం ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు’’ అని ఆయనన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top