లండన్‌ను వెనక్కినెట్టిన బెంగళూరు

Bengaluru Worlds Fastest Growing Tech Hub, London 2nd - Sakshi

నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం

2016–2020 మధ్య ఐదు రెట్లు పెరుగుదల 

సాక్షి, బెంగళూరు : బెంగళూరు.. భారతదేశ ఐటీ రాజధాని. ఈ పేరును ఉద్యాన నగరి మరోసారి సార్థకం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఐటీ రంగం వృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఐటీ రంగం అభివృద్ధి విషయంలో యూరోపియన్‌ నగరాలు లండన్, మ్యూనిచ్, బెర్లిన్‌లను సైతం వెనక్కి నెట్టి బెంగళూరు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. బెంగళూరు తర్వాత దేశీ నగరాల్లో ముంబై ఆరోస్థానంలో ఉంది. డీల్‌రూమ్‌.సీవో సమాచారాన్ని ది మేయర్‌ ఆఫ్‌ లండన్స్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్, పెట్టుబడుల ఏజెన్సీ సంస్థ లండన్‌ అండ్‌ పార్టనర్స్‌ విశ్లేషించి ఈ ర్యాంకింగులను ప్రకటించింది. 2016 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించి బెంగళూరుకు అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. 2016–2020 మధ్య కాలంలో బెంగళూరులో ఐటీ పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగాయి. 2016లో 1.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉండగా 2020 నాటికి 7.2 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. చదవండి: ఇద్దరు సీఎంల మధ్య భూవివాదం

మహారాష్ట్ర ముంబైలో 1.7 రెట్లు మేర పెట్టుబడులు పెరిగాయి. 2016లో 0.7 బిలియన్‌ డాలర్లు ఉన్న పెట్టుబడులు ఆ తర్వాత 2020 నాటికి 1.2 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇక లండన్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 2016లో 3.5 బిలియన్‌ డాలర్లు ఉండగా 2020లో 10.5 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. లండన్‌లో వృద్ధి రేటు మూడు రెట్లుగా ఉంది. ప్రపంచ సాంకేతికత వెంచర్‌ క్యాపిటలిస్టు (వీసీ) పెట్టుబడుల్లో కూడా బెంగళూరు దూసుకుపోతుండడం విశేషం. వీసీ పెట్టుబడుల్లో బెంగళూరులో ప్రపంచంలోనే ఆరోస్థానంలో నిలిచింది. అయితే వీసీ పెట్టుబడుల ర్యాంకింగుల్లో బీజింగ్, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్‌ నగరాలు బెంగళూరు కన్నా ముందుగా ఉన్నాయి. ఇక ముంబై ఈ విషయంలో 21వ స్థానంలో ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top