హవ్వ..! మతపైత్యం అదుపులో ఉంచుకోలేరా? | Bengaluru Abbigere Communal Slur Incident Sparks Outrage, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

హవ్వ..! మతపైత్యం అదుపులో ఉంచుకోలేరా?

Apr 23 2026 11:12 AM | Updated on Apr 23 2026 11:25 AM

Bengaluru Abbigere Incident Viral On Social media

మతాలు, కులాలు మనుషుల మధ్య అడ్డుగోడలుగా నిలవడం ఇవాళ్టి వ్యవహారం కాదు. ఈ గీతలు దాటిన ప్రేమలు ఎన్ని మొగ్గ తొడుగుతున్నప్పటికీ, పెళ్లిళ్లు ఎన్ని జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్తులోనైనా ఏదో ఒకనాటికి సమసిపోతాయని అనుకునే వాతావరణం మాత్రం లేదు. ఎందుకంటే.. ఎంతగా ఆధునిక సమాజం ఈ అడ్డుగోడల్ని దాటి వికసిస్తున్నదో.. అంతకంటే ఎక్కువగా మనుషుల్లో కుల జాడ్యం, మతమౌఢ్యం మరింతగా వేళ్లూనుకుంటున్న ఉదాహరణలు మనకు సర్వత్రా కనిపిస్తుంటాయి. సున్నితమైన ఈ అంశాల్లో ఎదుటివారి మనోభావాల్ని గాయపరచడం మాత్రమే కాదు.. దారుణంగా రెచ్చగొట్టే భయావహ వాతావరణానికి గురిచేసే ఘటనలు మనకు నిత్యం అనేకం తారసపడుతుంటాయి. బెంగుళూరు నగరంలో కూడా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది.

అబ్బిగెరె ప్రాంతంలో ఓ దంపతులు.. ఒక ముస్లిం వ్యక్తిని అభ్యంతరకరమైన మాటలతో నిందించారు. ‘నువ్వు ముస్లింవి. నువ్వు పాకిస్తానీవి. నువ్వొక టెర్రరిస్టువి’ అంటూ వారు అతడిని తూలనాడారు. ఇలాంటి మాటలు ఒక సాధారణ ముస్లింను ఎంతగా గాయపరుస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీరి నిందల పర్యవసానంగా స్థానికంగా ఒక సంస్థకు చెందిన వారు.. ఆ దంపతులకు సదవగాహన కల్పించి, బుద్ధిమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వారి ఇంటికి వచ్చి.. ఇలా ముస్లిం పేరుతో ఒక మనిషిని కించపరుస్తూ మాట్లాడడం, టెర్రరిస్టుగా అభివర్ణించడం తప్పు అని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ సంస్థ తరఫున వచ్చిన వారిలో కేవలం ముస్లిములే కాదు. అన్ని మతాల వారూ ఉన్నారు. ముస్లిం అయిన ప్రతీ వ్యక్తిని టెర్రరిస్టుగా చిత్రీకరించి.. సభ్యసమాజంలో అశాంతికి, అపోహలకు బీజం వేసే ఇలాంటి బుద్ధులను ఎండగట్టారు. ఆ దంపతులకు వీరు బుద్ధి మాటలు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.

ప్రత్యేకించి ఈ సంఘటనలో మరో సంగతి చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఆ దంపతుల్లో భర్త తమను గురించి తాము ఘనంగా చెప్పుకుంటూ.. నేను డిఫెన్సులో పనిచేస్తున్న వాడినే అంటూ గంభీరంగా సెలవిచ్చారు. డిఫెన్సులో పనిచేస్తున్న వ్యక్తివే అయితే గనుక.. నీలో మరింతగా దేశభక్తి ఉండాలి. ఈ దేశం అన్ని మతాలు, అన్ని ధర్మాల సమ్మేళనం అనే స్పృహ నీకు ఎక్కువగా ఉండాలి. పరమతసహనం కూడా నీలో ఎక్కువగా ఉండాలి.. కనిపించిన ప్రతి ముస్లింను పాకిస్తానీగా, టెర్రరిస్టుగా చిత్రీకరిస్తూ ఎలా మాట్లాడతావు? అంటూ వాళ్లు నిలదీశారు. చివరికి ఆ దంపతులు క్షమాపణ చెప్పబోయినప్పుడు కూడా..  మీరు క్షమాపణ చెప్పడం కాదు.. మీ ఆలోచన మార్చుకోవాలి.. అంటూ వారు హితవు చెప్పి వెళ్లడం గమనించాల్సిన సంగతి.

మనం చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం. ఇళ్లు అద్దెకు తీసుకునేందుకు తిరిగేవారిని మీరు శాకాహారులైతేనే ఇస్తాం’ అని చెప్పే వాళ్లు మనకు పురాతన కాలం నుంచి ఇవాళ్టికీ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మనుషుల్ని తప్పుబట్టే వాళ్లూ ఉంటారు. అయితే అలాంటి వారి బాధల్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. ముస్లిం అయిన వ్యక్తి కనిపిస్తే చాలు.. ‘మీరంతా పాకిస్తానీలు.. మీరంతా టెర్రరిస్టులు..’ అని నిందించే వారిని ఏమనాలి? పాకిస్తాన్ మీద ఉన్న ద్వేషాన్ని ఒక మతానికి ఆపాదించడమూ, ఆ మతానికి చెందిన అందరి మీదా టెర్రరిజం ముద్ర వేసేయడమూ ఎంత అనైతికం అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది.

దుర్మార్గాలు కులాల్ని బట్టి, మతాల్ని బట్టి ఉండవు. కేవలం మనుషుల్లో ఉండే బుద్ధుల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి తప్పుడు మనుషులు ఒకే మతంలో లేదా ఒకే కులంలో ఉంటారని అనడం, ఆపాదించడం సుహృద్భావ సమాజ ఆవిష్కరణకు పెనుద్రోహం అవుతుంది. ఆ సత్యం మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే.. ఏ ఇద్దరు మనుషుల మధ్య కూడా ఎలాంటి అపోహలూ ఉండని మంచి రోజులు తప్పకుండా వస్తాయి.
-యం.రాజేశ్వరి.

Advertisement
 
Advertisement
Advertisement