
చాప్రా: బీహార్‌లో వావివరుసలు మరచి ప్రవర్తించిన ఒక తండ్రి ఉదంతం కలకలం రేపుతోంది. రైలు టాయిలెట్‌లోని ఒక బ్యాగులో నవజాత శిశువు లభ్యమైన దరిమిలా పోలీసుల విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రైలులోని టాయిలెట్‌లో శిశువు ఏడుపు విన్న ప్రయాణికులు, వెంటనే ఆ శిశువును బయటకు తీసి, మొరాదాబాద్‌లోని రైల్వే పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో బీహార్‌కు చెందిన ఒక బాలిక తన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైందని, అయితే వారి కుటుంబ సభ్యులు దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని తేలింది. బాధితురాలు పోలీసులకు తెలిపిన సమాచారంలో.. తన తండ్రి మద్యం సేవించేవాడని, ఏడాదిగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. గర్భవతి అయిన బాలికను కుటుంబ సభ్యులు చికిత్స కోసం రైలులో ఢిల్లీకి తీసుకెళ్తున్నప్పుడు శిశువుకు జన్మనిచ్చిందని వెల్లడయ్యింది.
వారు ప్రయాణిస్తున్న రైలు వారణాసి సమీపంలో ఉండగా, ఆమె టాయిలెట్‌లో మగబిడ్డను ప్రసవించింది. అయితే కుటుంబ సభ్యులు ఆ శిశువును ఒక బ్యాగులో ఉంచి, దానిని అక్కడే ఉన్న మరొక రైలు టాయిలెట్‌లో పడవేసి, రైలు నుంచి దిగిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బరేలీ సమీపానికి రైలు చేరుకున్నంతలో ప్రయాణికులు ఆ శిశువును గుర్తించారు. వెంటనేవారు ఆ శిశువును టికెట్ తనిఖీ సిబ్బందికి అప్పగించారు. వారు ఆ శిశువును ఎయిర్ కండిషన్డ్ కోచ్‌కు తరలించారు. తరువాత ఆ శిశువుకు మొరాదాబాద్‌లో వైద్య సహాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.
బాధిత బాలిక కుటుంబ సభ్యులు వదిలివెళ్లిన బ్యాగులో లభ్యమైన సిమ్ కార్డ్ ఆధారంగా పోలీసులు బాధితురాలి ఆచూకీ తెలుసుకున్నారు. తరువాత ఆమెను మొరాదాబాద్‌కు తీసుకువచ్చారు. అయితే బాధితురాలు అక్కడి అధికారులతో ఆ శిశువును తాను పోషించలేనని లిఖిత పూర్వకంగా తెలిపింది. బాధితురాలితో పాటు వచ్చిన బంధువులు కూడా ఇదే విషయాన్ని పోలీసుల ముందు స్పష్టం చేశారని సమాచారం. దీంతో ఆ శిశువును మొరాదాబాద్‌లోని చైల్డ్ వెల్ఫేర్ సొసైటీలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.