ప్రతి రోజు రూ.7 పొదుపుతో.. నెలకు రూ.5 వేల పెన్షన్

Atal Pension Yojana: Know age wise investment to get Rs 60000 pension - Sakshi

అటల్ పెన్షన్ యోజన(ఎపీవై) అనేది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పథకం. దీనిని బీమా రెగ్యులేటర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఎ) నిర్వహిస్తుంది. పదవీ విరమణ సమయంలో స్థిర పెన్షన్ కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తుల కోసం అటల్ పెన్షన్ యోజన అనేది సరైన ఎంపిక. అసంఘటిత రంగంలోని ప్రజలకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించడానికి ప్రభుత్వం 1 జూన్ 2015న ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం మీరు ప్రతిరోజూ 7 రూపాయలు పొదుపు చేస్తే ప్రతి నెల రూ.5 వేల పెన్షన్ తీసుకోవచ్చు.

ఇది 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారికి అందుబాటులో ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత లబ్ధిదారులకు రూ.1000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వబడుతుంది. పెట్టుబడిదారుడి వయస్సు, మొత్తాన్ని బట్టి పెన్షన్ నిర్ణయించబడుతుంది. మీరు పొదుపు చేసే నగదును బట్టి ప్రతి నెల రూ.1000 నుంచి రూ.5000 వరకు పొందవచ్చు. ఈ పథకంలో చేరాలంటే సేవింగ్ బ్యాంకు అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ పథకానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగాలు అనర్హులు.

ఈ పథకం కింద ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సిసిడి(1 బి) కింద వినియోగదారులకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. చందాదారులకు నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన పొదుపు ఖాతా డబ్బులను జమ చేయవచ్చు. నెలకు రూ.1,000 నుంచి 5,000 రూపాయల స్థిర నెలవారీ పెన్షన్ పొందాలంటే, చందాదారుడు 18 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.42 నుంచి 210 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాలి. అదే 40 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.291 నుంచి రూ.1,454 మధ్య ప్రీమియం చెల్లించాలి. ఎన్‌పిఎస్ ట్రస్ట్ వెబ్‌సైట్‌లో ఎపివై కాలిక్యులేటర్ ఉంది. దీని ద్వారా మీరు మీ వయస్సు, ప్రతి నెల పెన్షన్ ఎంత కావాలో నమోదు చేస్తే నెలకు ఎంత ప్రీమియం చెల్లించాలో చూపిస్తుంది.

చదవండి:

ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top