అస్సాం పోరు 2026: ఈ ఐదు అంశాల్లోనే ‘దోబూచులాట’ | Assam Assembly Election 2026: 5 key factors that will decide | Sakshi
Sakshi News home page

అస్సాం పోరు 2026: ఈ ఐదు అంశాల్లోనే ‘దోబూచులాట’

Mar 22 2026 12:18 PM | Updated on Mar 22 2026 12:18 PM

Assam Assembly Election 2026: 5 key factors that will decide

గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 9న జరగనున్న ఒకే దశ పోలింగ్ కోసం రాష్ట్రంలో సన్నాహాలు సాగుతున్నాయి. 126 స్థానాల కోసం జరుగుతున్న ఈ సమరంలో కేవలం అభివృద్ధి మాత్రమే కాదు.. అస్తిత్వం, సామాజిక న్యాయం, వివాదాస్పద ‘ఎవిక్షన్’ డ్రైవ్‌లు.. మొదలైనవి గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా ఐదు అంశాలు ఈసారి ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా మారబోతున్నాయి.

1. జుబీన్ గార్గ్ సెంటిమెంట్
అస్సాం సాంస్కృతిక దిగ్గజం జుబీన్ గార్గ్ 2025 సెప్టెంబర్‌లో సింగపూర్‌లో మృతిచెందడం రాష్ట్ర ప్రజలను విషాదంలోకి నెట్టింది. ఈ కేసును హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం స్పెషల్ కోర్టుకు అప్పగించినప్పటికీ, విచారణ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. యువతలో ‘వాయిస్ ఆఫ్ జనరేషన్’గా పేరొందిన జుబీన్ ప్రభావం ‘సైలెంట్ ఓటర్ల’ రూపంలో తీర్పును మార్చే అవకాశం ఉంది.

2. ఎవిక్షన్ డ్రైవ్‌లు (ఆక్రమణల తొలగింపు)
అటవీ భూములు, ఆలయ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేశామని బీజేపీ కూటమి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే కాంగ్రెస్, ఏఐడీయూఎఫ్‌ మాత్రం దీనిని మైనారిటీలను లక్ష్యం చేసుకుని చేసిన మానవతా సంక్షోభంగా చిత్రీకరిస్తున్నాయి. ఈ అంశం మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కీలకం కానుంది.

3. చొరబాటు - సీఏఏ/ఎన్‌ఆర్‌సీ చర్చ
అక్రమ వలసల అంశం అస్సాం రాజకీయాల్లో ఎప్పుడూ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పీడిత మైనారిటీలకు రక్షణగా సీఏఏను బీజేపీ సమర్థిస్తుంటే, అస్సాం ఒప్పందాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఎన్‌ఏఆర్‌సీ ద్వారా అసలైన భారతీయులను వేధిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

4. బాల్య వివాహాలపై ఉక్కుపాదం
‘పాక్సో’ చట్టం కింద ప్రభుత్వం చేపట్టిన సామూహిక అరెస్టులను ఎన్డీఏ ప్రభుత్వం ఒక చారిత్రక సామాజిక సంస్కరణగా అభివర్ణిస్తోంది. అయితే ఇది ఓటర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నమని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు సగం మంది ఉన్న మహిళా ఓటర్ల తీర్పుపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

5. సంక్షేమం - నిరుద్యోగం
నెలకు ₹1,250  అందించే ‘అరుణోదయ్ పథకం, టీ-వర్కర్ల సంక్షేమం, 1.6 లక్షల ఉద్యోగాల కల్పనపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అయితే పెరిగిన అప్పులు, నిరుద్యోగం, భూసేకరణ సమస్యలను ఎత్తిచూపుతూ గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ దీటుగా బదులిస్తోంది.

అస్సాం ఎన్నికల కీలక తేదీలు
నామినేషన్ల గడువు: మార్చి 23, 2026
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9, 2026 (ఒకే దశ)
ఫలితాల విడుదల: మే 4, 2026

ఇది కూడా చదవండి: Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement