Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’ | Kerala elections Fishermen say local issues ignored | Sakshi
Sakshi News home page

Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’

Mar 22 2026 11:22 AM | Updated on Mar 22 2026 11:22 AM

Kerala elections Fishermen say local issues ignored

తిరువనంతపురం: కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అధికారం కోసం వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అయితే 600 కిలోమీటర్ల పొడవైన కేరళ తీరంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏ పార్టీ గెలిచినా తమ బతుకులు మారడం లేదని ఇక్కడ ఉంటున్న  మత్స్యకారులు నేతలను నిలదీస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ, కేవలం ‘ఓటు బ్యాంకు’గా మాత్రమే తమను వాడుకుంటున్నారన్న కోపం ఇప్పుడు వారి గళంలో స్పష్టంగా వినిపిస్తోంది.

నిర్ణయాత్మక శక్తిగా..
ఈ ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది జనాభా కలిగిన లాటిన్ కాథలిక్ కమ్యూనిటీ ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. తిరువనంతపురం లాటిన్ ఆర్చ్‌డయోసీస్ వికార్ జనరల్ ఫాదర్ యూజీన్ పెరీరా మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తమ సమస్యలకు మేనిఫెస్టోలో ఇచ్చే ప్రాధాన్యతను బట్టే మద్దతు ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఇది అన్ని పార్టీలకు ఒక హెచ్చరికలా మారింది.

విజింజం కల.. జాలర్ల కన్నీరు
ఒకప్పుడు గర్వకారణంగా భావించిన విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం, నేడు స్థానిక మత్స్యకారుల పాలిట శాపంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోర్టు నిర్మాణంతో తమ జీవనోపాధి దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, అంతర్జాతీయ పోర్టుకు ఆనుకుని ఉన్న కోవలం తదితర నియోజకవర్గాల్లో ప్రజలు నేటికీ తాగే నీటిని బిందె రూ. 7 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ నీటి కష్టాలు రాబోయే ఎన్నికల్లో పాలకులకు గట్టి దెబ్బే తగిలేలా ఉన్నాయి.

కబళిస్తున్న సముద్రం.. కనుమరుగవుతున్న ఇళ్లు
తీరప్రాంతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘సముద్ర కోత’. అలల ఉధృతికి ఇళ్లు జలసమాధి అవుతుంటే, పునరావాసం కోసం మత్స్యకారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బ్లూ ఎకానమీ’ విధానాలు, సముద్ర భాగాలను మైనింగ్ కోసం లీజుకు ఇవ్వడం వంటి నిర్ణయాలపై జాలర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సముద్రమే తమ తల్లి అని నమ్ముకున్న వారు, ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు.

పెండింగ్ డిమాండ్లు.. అప్పుల ఊబి
చిరయింకీజులో సముద్రపు గోడ నిర్మాణం, ముతలపొళి వద్ద పూడికతీత పనులు వంటి మౌలిక వసతుల డిమాండ్లు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు, వాతావరణ మార్పుల వల్ల వేట తగ్గి, ఆదాయం పడిపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. రాజకీయ నేతల ఆర్భాటపు ప్రసంగాలు తమ ఆకలిని తీర్చవని, తమ సమస్యలను పరిష్కరించే వారికే ఈసారి ఓటు వేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.

జాలర్ల ఆగ్రహం..
కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత్స్యకారులందరిదీ ఇప్పుడు ఒకటే గోడు. ఈ ‘తీరప్రాంత ఓటు’ కేరళ రాజకీయాల్లో ఏ పార్టీని ముంచుతుందో, ఎవరిని గట్టెక్కిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఓట్ల పండగ వస్తోంది కానీ, ఆ ఇళ్లలో వెలుగులు నింపే నేత ఎవరో తేలాల్సి ఉంది. జాలర్ల ఆగ్రహం ఈసారి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. భక్తులకు ప్రత్యేక సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement