వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. భక్తులకు ప్రత్యేక సూచన | Vaishno Devi Yatra suspended: Crucial update for pilgrims | Sakshi
Sakshi News home page

వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. భక్తులకు ప్రత్యేక సూచన

Mar 22 2026 10:03 AM | Updated on Mar 22 2026 10:03 AM

Vaishno Devi Yatra suspended: Crucial update for pilgrims

జమ్మూ: ప్రస్తుతం కొనసాగుతున్న చైత్ర నవరాత్రుల వేళ జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం భక్తజన సంద్రమైంది. రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తడంతో భద్రతా కారణాల దృష్ట్యా శనివారం (మార్చి 21) సాయంత్రం యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

ఒక్కరోజే 39 వేల మంది..
రియాసీ జిల్లాలోని త్రికూట పర్వతాలపై కొలువైన ఈ దివ్య క్షేత్రానికి శనివారం ఒక్కరోజే సుమారు 39,000 మంది భక్తులు తరలివచ్చారు. చైత్ర నవరాత్రులు (మార్చి 19 - మార్చి 27) ప్రారంభమైన మూడవ రోజే ఈ స్థాయిలో రద్దీ పెరగడంతో, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మళ్లీ రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే..
యాత్ర నిలిపివేతతో కొత్త రిజిస్ట్రేషన్లను ప్రస్తుతానికి ఆపివేశారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు పోలీసులు మైకుల ద్వారా భక్తులకు సమాచారం అందించారు. అప్పటి వరకు భక్తులు తమ హోటళ్లలోనే వేచి ఉండాలని సూచించారు. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న సుమారు 10,000 మంది భక్తులు ప్రస్తుతం కొండపైకి వెళ్తున్నట్లు సమాచారం. ‘జై మాతా దీ’ స్మరణలతో కొండ మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.

పటిష్ట భద్రత - ప్రత్యేక పూజలు
నవరాత్రుల రద్దీ దృష్ట్యా కత్రా బేస్ క్యాంప్ నుండి ఆలయ మార్గం వరకు బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సదుపాయాలు, మార్గదర్శక కేంద్రాలను బోర్డు సిద్ధం చేసింది. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో గురువారం ప్రారంభమైన 'శత చండీ మహాయాగం' శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండటంతో రాబోయే వారం రోజుల పాటు రద్దీ ఇలాగే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement