breaking news
Mata Vaishnav Devi Temple
-
నేటి నుంచి వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా త్రికూట పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవి ఆలయ తీర్థయాత్ర ఈ నెల17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే, వాతావరణం అనుకూలంగా ఉంటేనే యాత్ర మొదలవుతుందని ఆలయ బోర్డు మంగళవారం తెలిపింది. ఆగస్ట్ 26వ తేదీన ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి పడి 34 మంది యాత్రికులు చనిపోవడం తెల్సిందే.ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా యాత్రను నిలిపివేశారు. ఈ నెల 14వ తేదీన యాత్ర పునఃప్రారంభం అవు తుందని ఆలయ బోర్డు ప్రకటించింది. అయితే, ఎడతెరిపి లేని వానలతో వాయిదా వేస్తున్నట్లు తెలి పింది. అయితే, రెండు రోజుల క్రితం కొందరు యాత్రికులు కాట్రా బేస్ క్యాంప్ వద్ద ఆందోళనకు దిగడంతో యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. -
గంటసేపు సొరంగంలోనే
చండీగఢ్: మాతా వైష్ణవీ దేవి ఆలయం- ఢిల్లీ మధ్య ఇటీవల ప్రవేశపెట్టిన శ్రీశక్తి సూపర్‌ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు గంటపాటు ప్రయాణికులను బెంబేలెత్తించింది. కత్రా రైల్వేస్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోగల ఓ సొరంగంలో బుధవారం ఈ రైలు ఆగిపోయింది. ఈ రైలును ఇటీవల ప్రారంభించిన సంగతి విదితమే. ఈ విషయమై ఫిరోజ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎన్సీ గోయల్ మాట్లాడుతూ ఏడు గంటలకు కత్రా స్టేషన్‌కు చేరుకుందన్నారు. వాస్తవానికి ఇది ఈ స్టేషన్‌కు ఉదయం గం 5.30కే రావాల్సి ఉందన్నారు. ఈ సమాచారం అందగానే ఉధంపూర్నుంచి మరో ఇంజన్‌ను అక్కడికి పంపించామన్నారు. ఇంజన్ ఎందుకు పనిచేయలేదనే అంశానికి సంబంధించి తమకు సమాచారం అందాల్సి ఉందన్నారు. 100 నిమిషాల తర్వాత శ్రీశక్తి సూపర్‌ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు తన గమ్యస్థానానికి చేరుకుందన్నారు. అప్పటికే ఈ రైలు 35 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తోందని, దీంతో 100 నిమిషాల తర్వాత తన గమ్యస్థానానికి చేరుకుందన్నారు. ఇదే విషయమై ఉత్తర రైల్వే డివిజనల్ మేనేజర్ నీరజ్‌శర్మ మాట్లాడుతూ ఇంజన్ పనిచేయకపోవడం వల్లనే రైలు సొరంగంలో చిక్కుకుపోయిందన్నారు. టన్నెల్ మార్గంలో ఎటువంటి సమస్యలూ లేవన్నారు. మరో ఇంజన్ అక్కడికి చేరుకుని ఈ ఎక్స్‌ప్రెస్‌ను గమ్యస్థానానికి చేర్చిందన్నారు.