పెళ్లి తర్వాత మహిళా ఉద్యోగి తొలగింపు.. కేంద్రానికి సుప్రీం షాక్‌

Army Nurse Was Fired Over MarriageShe Will Now Get Rs 60 Lakh In Damages - Sakshi

న్యూఢిల్లీ: వివాహాన్ని సాకుగా చూపి మహిళను ఉద్యోగంలో నుంచి తొలగించడం లింగ వివక్షత చూపించడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్షాపూరితంగా వ్యవహరించే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమంతించబోదని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత మహిను ఉద్యోగంలో నుంచి తొలగించినందుకు ఆమెకు రూ. 60లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

దేశ సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను వివాహం అనంతరం తొలగించిన కేసుపై జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, దిపాంకర్‌ దత్తా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.  వివాహం అనంతరం సెలినా జాన్‌ అనే నర్సును 1988లో విధుల నుంచి తొలగించారు. అప్పుడు ఆమె సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను తొలగించడంపై 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను 2019లో సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రం సవాలు చేసింది.

ట్రిబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని ఫిబ్రవరి 14 నాటి ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. వివాహ కారణాలతో మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌ నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనను 1995లో ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే  బాధితురాలు ప్రైవేటుగా కొంతకాలం నర్స్‌గా పనిచేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.

సదరు ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ, వేతనాన్ని ఇవ్వాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవరించింది. ఆమెకు బకాయిల రూపంలో రూ .60లక్షలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలు అందిన ఎనిమిది వారాల్లోగా ప్రభుత్వం ఈ పరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది.
చదవండి: కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై అఖిలేష్‌ యాదవ్‌ కీలక ప్రకటన
 

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top