
2024 లోకసభ ఎన్నికలు ముగియగానే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎస్ఫీ ఎంపీలకు పలు సూచనలు చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ నుంచి కొత్తగా ఎంపికైన ఎంపీలతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలు విని, పరిష్కారానికి కృషి చేయాలని, అప్పుడే భవిష్యత్‌లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.
లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలతో అఖిలేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీకి పెద్దఎత్తున ప్రజల మద్దతు లభించిందన్నారు. దీంతో సోషలిస్టుల బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రజలు చెప్పే విషయాన్ని వినాలని, వారి సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని పిలుపునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లకు గాను ఎస్పీ 37 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ ఆరు సీట్లు దక్కించుకుంది.