సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలవడానికి తమిళనాడు సీఎం విజయ్ ఎప్పుడూ సమయం కోరలేదని ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు.
బుధవారం హోసూరులో మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. మంత్రి నిర్మల్ కుమార్ ప్రెస్‌మీట్‌లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సీఎం విజయ్ ఇప్పటివరకు పళణి స్వామిని కలవడానికి అనుమతి అడిగింది లేదన్నారు. తాము నిరాకరించింది లేదని ఆయన తేల్చి చెప్పారు.
సీఎం విజయ్‌పై ఘాటు వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ శైలిపై కేపీ మునుసామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్ కష్టపడి ఈ స్థాయికి రాలేదని, సినిమా పరిశ్రమలో ఒక మాయను సృష్టించి, ఆ మాయా రూపాన్ని ఇన్‌స్ట్రాగామ్, రీల్స్‌లో చూపించారని ఎద్దేవా చేశారు. యువత నమ్మి ఓటేశారని పేర్కొంటూ, తిరుచ్చిలో జరిగిన కృతజ్ఞత సభలో సినిమాలో డైలాగులు చెప్పినట్లే కేవలం 15 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. వెనుక ఉండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదివారు అంతే అని వ్యంగ్యాస్త్రం సంధించారు.
సొంత ఆలోచన లేదు
ప్రజలు మనకెందుకు ఓటేశారని, మనం ఇచ్చిన హామీలు ఏంటి అని, వాటి కోసం ఎలాంటి పథకాలు తీసుకురావాలనే విషయాలపై సీఎం విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రోజే మాట్లాడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అక్కడ ఆయన మౌనంగా ఉండిపోయారని, ప్రధాని మోదీతో కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేశారని, ఇందులో ఓ ఐదు నిమిషాలు కుశల ప్రశ్నలకు, మరో ఐదు నిమిషాలు రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు సమయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. సీఎం విజయ్‌కు సొంత ఆలోచనలు లేవని, ఆయన విషయం లేని సీఎం అని ఎద్దేవా చేశారు.
రాజకీయాల్లో ఏ పార్టీ అంతరించిపోదని, ఒకే ఒక్క కార్యకర్త ఉన్నా ఆ పార్టీ బతికే ఉంటుందని మునుసామి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు వందేళ్లుగా అధికారంలోకి రాకపోయినా సిద్ధాంతం కోసం పోరాడుతున్నారని, అన్నాడీఎంకే కూడా అలాంటి బలమైన సిద్ధాంతం కలిగిన పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు సీఎం విజయ్‌కు తెలియవని , ఒకవేళ విజయ్ నిజంగానే ఎంజీఆర్, జయలలితను విమర్శించకూడదు అనుకుంటే.. ఆయన మొదట కలవాల్సింది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామినే అని స్పష్టం చేశారు.


