అగ్రి స్టార్టప్స్‌.. దున్నేస్తున్నాయ్‌!

agri startups growth increasing in india 2021 - Sakshi

వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం 

విత్తనాలు, ఎరువులు, కోత, మార్కెటింగ్‌ అన్ని దశల్లోనూ స్టార్టప్స్‌ సేవలు 

2025 నాటికి 24.1 బిలియన్‌ డాలర్లకు దేశీ అగ్రిటెక్‌ మార్కెట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘దేశానికి వెన్నెముక రైతు’ అంటారు. కానీ, నేటి సాంకేతిక యుగంలో రైతుకే వెన్నెముకలా నిలుస్తున్నాయి అగ్రి స్టార్టప్స్‌. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో అన్ని రంగాలు క్షీణిస్తే.. ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే స్థిరమైన వృద్ధిని సాధించింది. ఇందుకు కారణం.. వ్యవసాయ పనుల్లో సాంకేతికతను వినియోగించటమే. వాతావరణం, నేల పరీక్షల నుంచి మొదలుపెడితే.. నాట్లు, ఎరువుల పిచికారీ, పంట నిర్వహణ, కోత, ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్, ధరల నిర్ణయం, గిడ్డంగులు, రుణాలు ఇలా ప్రతి దశలోనూ అగ్రి స్టార్టప్స్‌ అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి.

మనది వ్యవసాయ ఆధారిత దేశం. 58 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ప్రస్తుతం దేశంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న అగ్రి స్టార్టప్స్‌ 50-60 వరకుంటాయి. అగ్రిస్టార్టప్స్‌ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆ్రస్టేలియా, అమెరికా, స్విట్జర్లాండ్‌ ఎక్కువగా ఉంటాయి. భూమి ఎక్కువగా అందుబాటులో ఉండటం, విరివిగా ఆధునిక సాంకేతిత వినియోగం, రైతుల అక్షరాస్యత, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. మన దేశంలో అగ్రి స్టార్టప్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లు ముందు వరుసలో ఉన్నాయి. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ప్రోత్సాహం, చాలా వరకు అగ్రి స్టార్టప్స్‌ ప్రమోటర్లు ఆయా రాష్ట్రాల నుంచే ఉండటం దీనికి ప్రధాన కారణాలని ఓరిగో కమోడిటీస్‌ కో-ఫౌండర్, డైరెక్టర్‌ సునూర్‌ కౌల్‌ తెలిపారు. 

దేశీయ అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ 2014 నుంచి 2020 సెప్టెంబర్ వరకు 467 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. 2025 నాటికి దేశీ అగ్రిటెక్‌ మార్కెట్‌ 24.1 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఇండియన్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ ఇక్‌42 అంచనా వేసింది. మొత్తం అగ్రిటెక్‌ మార్కెట్‌ టర్నోవర్‌ 170 బిలియన్‌ డాలర్లు కాగా.. ఇప్పటివరకు 204 మిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను మాత్రమే అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ సాధించాయని పేర్కొంది. గత ఏడాది కాలంగా వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్‌ వినియోగం బాగా పెరిగింది. దేశంలో లాక్‌డౌన్‌ విధించిన కాలంలో అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ పనితీరు మీద క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ అడ్వైజరీ ఓమ్నీవోర్‌ ఓ సర్వేను నిర్వహించింది. కరోనా ప్రారంభమైన ఏడాది కాలంలో 85% అగ్రిస్టార్టప్స్‌కు డిమాండ్‌ పెరిగిందని.. 51% స్టార్టప్స్‌ కరోనా కంటే మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 50% వృద్ధిని సాధించాయని తెలిపింది. 

కోతకు ముందు, తర్వాత సేవలు.. 
అగ్రి స్టార్టప్స్‌ సేవలను పంట కోతకు ముందు, తర్వాత అని రెండు రకాలుగా విభజించవచ్చు. క్రిషితంత్ర, మారుట్‌ డ్రోన్స్, క్రాపిన్‌ వంటి కంపెనీలు వాతావరణం, నేల రకాన్ని పరీక్షించడం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాల ఎంపిక, ఆర్థిక ప్రోత్సాహం వంటి పంట కోతకు ముందు సేవలను అందిస్తున్నాయి. నిన్‌జాకార్ట్, ఓరిగో, క్రోఫామ్, ఫామ్‌లింక్, వంటి కంపెనీలు పంట ఉత్పత్తుల సప్లయి, గిడ్డంగులు, మార్కెటింగ్, ధర ఎంపిక, చెల్లింపుల విధానం వంటి పంట తర్వాత సేవలను అందిస్తున్నాయి. అగ్రిస్టార్టప్స్‌తో పొలంలో భౌతికంగా పనిచేయాల్సిన అవసరం సగానికి పైగా తగ్గుతుంది. 

వ్యవసాయ కూలీల కొరత, క్రిమిసంహారకాల  పిచికారీతో ఆరోగ్య సమస్యలను అధిగమించడంతో పాటు రైతులకు అధిక పంట దిగుబడులను, లాభాలను ఆర్జించవచ్చు. కార్మికుల వ్యయం, ఎరువుల వాడకం, సమయం వంటి ఇన్‌పుట్‌ కాస్ట్‌ తగ్గుతుందని మారుట్‌ డ్రోన్‌టెక్‌ సీఈఓ ప్రేమ్‌కుమార్‌ విస్లావత్‌ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, తాండూర్, పాలెం, కంపసాగర్‌ ప్రాంతాల్లోని సుమారు 3,200 మంది రైతులు, 10,800 ఎకరాలలో డ్రోన్స్‌తో పిచికారి, ఫామ్‌ ఫీల్డ్‌ సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు.

దేశంలో అగ్రిస్టార్టప్స్‌ వృద్ధికి ప్రధాన కారణాలివే...

 • గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగం పెరగడం. 
 • కరోనా వ్యాప్తితో డిజిటలైజేషన్‌కు మారటం. 
 • విద్యావంతులు వ్యవసాయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వటం. 
 • వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వినూత్న పద్దతులు అవలంభిస్తుండటం. 
 • అన్ని రంగాల్లో లాగే వ్యవసాయ రంగంలో కూడా అంతర్జాతీయ కంపెనీలు, దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుండటం. 
 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తుండటం. 
 • నాణ్యమైన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉండటం.

ఏ స్టార్టప్స్‌ ఏ సేవలందిస్తున్నాయంటే? 

 • వాతావరణం, నేల పరీక్షలు: క్రిషి తంత్ర, హార్వెస్టో, డీహాట్, మిత్ర, గ్రామోఫోన్‌. 
 • విత్తనాలు, ఎరువుల పిచికారీ: మారుట్‌ డ్రోన్స్, జనరల్‌ ఏరోనాటిక్స్, ప్రైమ్‌ యూఏవీ, థానోస్‌ టెక్నాలజీస్, బైజాక్, ఫ్రెషోకాట్జ్, ఏజీనెక్ట్స్‌ టెక్నాలజీస్, స్కైక్రాఫ్ట్‌. 
 • పంట నిర్వహణ: క్రాపిన్, ఏబోనో, క్రిహిహబ్, ఫామ్‌ఈఆరీ్ప. క్లోవర్, ఆక్సిన్‌. 
 • వ్యవసాయ యంత్రాలు: బిగ్‌హాట్, ఈఎం3 అగ్రి సర్వీసెస్, కేతీగాడీ, జేఫార్మ్‌ సర్వీసెస్, ట్రింగో, ఉజ్జయ్, ఫ్లైబర్డ్‌. 
 • సప్లయి, మార్కెటింగ్‌: అగ్రిబజార్, క్రోఫామ్, ఫామ్‌పాల్, నిన్‌జాకార్ట్, ఈకోజెన్, వేకూల్, మేరాకిసాన్, ఫామ్‌లింక్‌. 
 • రుణాలు, గిడ్డంగులు: ఓరిగో, సమున్నతి, ఫార్మర్ట్, అర్గోస్, జైకిసాన్, పేఅగ్రి, క్యాష్‌ప్లో, క్రిషీ ట్రేడ్, గ్రామీణ్, డబ్ల్యూహెచ్‌ఆర్‌ లోన్స్‌.

చదవండి:

కోవిడ్-19 రోగుల‌కు ఆక్సీమీట‌ర్లు ఎందుకు అవసరం?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top