అవిశ్రాంత పోరులో అన్నదాతకు కొంత ఊరట

In Agitation Farmers Get Relaxation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. అన్నదాత చేపట్టిన ఆందోళనలకు దేశమంతా మద్దతు తెలుపుతోంది. అవిశ్రాంత పోరాటం చేస్తున్న రైతుల ఉద్యమం మంగళవారానికి (జనవరి 12) 48వ రోజుకు చేరింది. దాదాపు నెలన్నర రోజులకు రైతులకు కొంత ఊరట లభించింది. సుప్రీంకోర్టు తాత్కాలికంగా నూతన వ్యవసాయ చట్టాల అమలుపై మంగళవారం స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టే ద్వారా ప్రయోజనం ఏమీ ఉండదని, సుప్రీం ఏర్పాటుచేసిన కమిటీ వలన ఎలాంటి ఫలితం ఉండదని పెదవి విరుస్తున్నారు. తాము చట్టాల రద్దు ఒకటే డిమాండ్‌ చేస్తున్నట్లు.. దానికి కమిటీలు.. చర్చలు అంటూ ఏవీ వద్దని తేల్చి చెబుతున్నారు. (కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే)

ఈ రైతుల పోరాటం దేశంతో ప్రపంచాన్ని కదిలించింది. పలు దేశాలు, సంస్థలు వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటించాయి. అయితే ఈ ఉద్యమం రైతుల బలిదానాలు కూడా చోటుచేసుకుంటుండడం బాధించే విషయం. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బాబా నసీబ్ సింగ్ మన్ అనే రైతు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 48 రోజుల ఉద్యమంలో ఇప్పటివరకు దాదాపు 57 మంది రైతులు చనిపోయారు. వారిలో కొందరు ఆత్మహత్య చేసుకోగా.. మరికొందరు అనారోగ్యంతో మృతిచెందారు. ఢిల్లీ సరిహద్దులో రోడ్లపై ఆందోళన చేస్తున్న రైతులు అత్యల్ప ఉష్ణోగ్రత్తలు ఉండడంతో చలికి తట్టుకోలేక ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 8 సార్లు చర్చలు చేసినా రైతులు ఒక్క మెట్టు కూడా దిగకుండా నిరంతర పోరు సాగిస్తున్నారు. తమకు కావాల్సింది నూతన వ్యవసాయ చట్టాల రద్దు అని తమ డిమాండ్‌ను స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి.. పోలీసుల వేధింపులతో పాటు వాతావరణాన్ని తట్టుకుని అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. భవిష్యత్‌ తరాలకు సులభతరమైన వ్యవసాయం ఇద్దామనే ఉద్దేశంతో రైతులు ఆందోళన సాగిస్తున్నారు. 

వీరి పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అవహేళన చేసినా పట్టించుకోలేదు. పిజ్జా-బర్గర్లు తిని పోరాటం.. ఆందోళనకారులంతా ఉగ్రవాదులు.. తీవ్రవాదులని ఆరోపించినా వెరవకుండా పోరాట పంథా వీడడం లేదు. అలాంటి రైతుల పోరాటానికి సుప్రీంకోర్టు కరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూనే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ధర్మాసనం నిర్ణయంతో రైతుల పోరాటానికి తాత్కాలిక విజయం దక్కినట్టుగా భావించవచ్చు. సుప్రీం ఏర్పాటుచేసిన కమిటీకి కూడా తాము ఒకటే మాట చెబుతామని.. కొత్త సాగు చట్టాల రద్దే తమ డిమాండ్‌ అని స్పష్టం చేస్తామని రైతులు చెబుతున్నారు. మరి సుప్రీం ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో.. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో.. రైతులు ఎప్పుడు ఆందోళన బాట వీడతారో వేచి చూడాలి. కానీ రైతుల సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోయేలా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరో స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top