సుప్రీం విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని పరిశీలిస్తున్నాం

Actively considering live telecast of Supreme Court - Sakshi

సీజేఐ ఎన్వీ రమణ

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జరిగే విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ముందుగా, సుప్రీంకోర్టులోని ఇతర జడ్జీల అభిప్రాయాన్ని తెలుసుకుంటానన్నారు. సుప్రీంకోర్టు వర్చువల్‌ హియరింగ్స్‌కు హాజరు కావడానికి జర్నలిస్టులకు మొబైల్‌ యాప్‌లో లింకులు అందించడం ద్వారా సేవలు అందించే ప్రక్రియను జస్టిస్‌ ఎన్వీ రమణ గురువారమిక్కడ ప్రారంభించారు. కోర్టు వార్తలు కవర్‌ చేయడానికి న్యాయవాదులపై మీడియా ఆధారపడి ఉందని తెలిసిందని, ఈ నేపథ్యంలో మీడియా విచారణలకు హాజరు కావడానికి ఓ యంత్రాంగం రూపొందించాలని అభ్యర్థన వచ్చిందని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు.

రిపోర్టింగ్‌ సమయంలో మీడియా అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, జర్నలిస్టుగా తాను కూడా కొంతకాలం పనిచేశానని, ఆ సమయంలో కార్లు, బైకులు లేవని ఆయన గుర్తు చేసుకున్నారు. వార్తలు సేకరించే క్రమంలో బస్సుల్లో ప్రయాణిస్తూ జర్నలిస్టుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. సుప్రీంకోర్టు, మీడియాకు మధ్య ఓ సీనియర్‌ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా రూపొందించిన మొబైల్‌ యాప్‌తో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చన్నారు. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు మొబైల్‌ అప్లికేషన్‌లో ‘ఇండికేటివ్‌ నోట్స్‌’అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. దీని ద్వారా చారిత్రక తీర్పుల సారాంశాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

106 మంది హైకోర్టు జడ్జీలకు కరోనా
దేశవ్యాప్తంగా 106 మంది హైకోర్టు జడ్జీలు కరోనా బారిన పడ్డారని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. రెండు ప్రధాన హైకోర్టులు మినహా సమాచారం మేరకు 2,768 మంది జ్యుడిషియల్‌ అధికారులకు కరోనా సోకిందన్నారు. ముగ్గురు హైకోర్టు జడ్జీలు, 34 మంది జ్యుడిషియల్‌ అధికారులు ఈమహమ్మారికి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 800 మంది రిజిస్ట్రీ సిబ్బంది కరోనా బారినపడగా వీరిలో సుప్రీంకోర్టులో ఆరుగురు రిజిస్ట్రార్లు, 10మంది అదనపు రిజిస్ట్రార్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top