ఏసీబీ గర్జన.. అధికారుల ఇళ్లలో సోదాలు

ACB Raids On Nine Officials Offices Residence Karnataka - Sakshi

బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన ఆరోపణలతో పలువురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, ఆఫీసులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో 9 మంది అధికారుల ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. ఇందులో భారీఎత్తున బంగారు ఆభరణాలు, నగదుతో పాటు లెక్కలోకి రాని స్థిర చరాస్తులను కనిపెట్టారు. ఈ  ఏడాదిలో జరిగిన రెండో ఏసీబీ దాడి ఇది.

అధికారులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు  

  • సుమారు 52 మంది ఏసీబీ అధికారులు, 174 మంది ఏసీబీ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. చిక్కబళ్లాపురలో కృష్ణేగౌడ, అతని సోదరుని ఇళ్లపై ఏసీబీ ఎస్పీ కళా కృష్ణమూర్తి నేతృత్వంలో దాడులు జరిగాయి. ఇద్దరి ఇళ్లలో ఫైళ్లు, ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి.  
  • బెళగావి విద్యుత్‌శాఖ ఇన్‌స్పెక్టర్‌ హనుమంత శివప్పచిక్కణ్ణనవర్‌ విలాసవంతమైన ఫ్లాటులో భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు, వివిధ చోట్ల ఖరీదైన ఫ్లాట్లు, వివిధ బ్యాంకుల్లో ఎఫ్‌డీలు, భారీఎత్తున ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకున్నారు.  
  • మైసూరులో మూడుచోట్ల ఏసీబీ దాడులతో నగరంలోని ప్రభుత్వ సిబ్బంది హడలిపోయారు. మైసూరు టౌన్‌ప్లానింగ్‌ అధికారి సుబ్రమణ్య వీ.వడ్కర్‌ ఇంటితో పాటు కారవారలో ఉన్న తల్లి నివాసంలోనూ దాడులు సాగాయి.  
  • మైసూరు ఎఫ్‌డీఏ చన్నవీరప్ప ఇంట్లో పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలతో పాటు భూములు, స్థలాల పత్రాలు దొరికాయి. ఆఫీసులో ఉండాల్సిన అనేక ఫైళ్లు, డీడీలు ఇంట్లో ఉన్నాయి. విలువైన గడియారాలు లభించాయి.  
  • యాదగిరి వలయ బెస్కాం లెక్కాధికారి రాజుపత్తార్‌ ఇంట్లో నగలు, బ్యాంక్‌  పాస్‌పుస్తకాలు, లాకర్‌ గుర్తించారు.   
  • బెంగళూరులో బీఎంటీఎఫ్‌ సీఐ విక్టర్‌సీమన్‌ కసవనహళ్లిలోని నివాసం, మైసూరులో ఉన్న మామ ఇంట్లో సోదాలు జరిగాయి. భారీఎత్తున స్థిరచరాస్తులు లభించాయి. 
  • బీబీఎంపీ యలహంక వలయ నగర ప్లానింగ్‌ విభాగ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కే.సుబ్రమణ్యంకి శంకరనగరలో స్టార్‌హోటల్‌ను తలదన్నేలా నివాసం ఉంది. ఇటీవలే కొన్నట్లు తెలిసింది.  
  • డిప్యూటీ డైరెక్టర్‌  కేఎం.ప్రథమ్‌కు బెంగళూరు నాగశెట్టిహళ్లిలో ఉన్న నివాసం,  సోదరుని ఇంటిపై దాడులు జరిగాయి.

ఏసీబీ దాడులు ఎదుర్కొన్న అధికారులు వీరే
1. కృష్ణేగౌడ, నిర్మితికేంద్ర పథకం డైరెక్టర్‌– చిక్కబళ్లాపుర 
2. హనుమంత శివప్పచిక్కణ్ణనవర్, డిప్యూటీ విద్యుత్‌ శాఖ ఇన్‌స్పెక్టర్‌– బెళగావి వలయం 
3. సుబ్రమణ్య వీ.వడ్కర్, జాయింట్‌డైరెక్టర్‌ టౌన్‌ప్లానింగ్, మైసూరు 
4. మునిగోపాల్‌ రాజు–బెస్కాం ఇంజనీర్, మైసూరు 
5. చిక్కవీరప్ప, ఏ గ్రేడ్‌ అధికారి, ఆర్‌టీఓ కార్యాలయం, మైసూరు 
6. రాజు పత్తార్‌– లెక్కాధికారి, బెస్కాం యాదగిరి 
7. విక్టర్‌ సీమన్, సీఐ, బీఎంటీఎఫ్, బెంగళూరు  
8. కే.సుబ్రమణ్యం, జూనియర్‌ ఇంజనీర్, టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయం, బీబీఎంపీ, యలహంక 
9. కేఎం.ప్రథమ్‌– డిప్యూటీ డైరెక్టర్, పరిశ్రమలు, బాయిలర్స్, దావణగెరె వలయం  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top