బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం
ప్రభుత్వ భవనంలో చెలరేగిన మంటలు
దీని వెనుక బీజేపీ హస్తం ఉంది: తృణమూల్ కాంగ్రెస్
కోల్‌కతా: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,000 ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) మంటల్లో కాలి బూడిదయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను నగరంలోని అలీపూర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనంలో భద్రపర్చారు. ఇది బహుళ అంతస్తుల భవనం. ఇందులో ఎన్నికల సంబంధిత విభాగాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. శుక్రవారం ఉన్నట్టుండి భవనంలో మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఇటీవల ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపయోగించిన 4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కుట్ర ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. భవనంలో హఠాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదని బెంగాల్ ఫైర్ సర్వీసుల శాఖ మంత్రి కౌశిక్ చౌదరి చెప్పారు. మొదట కింది అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా 8, 9 అంతస్తులకు వ్యాపించాయి. ఈ రెండు అంతస్తుల్లోనే ఎన్నికల విభాగాలు ఉన్నాయి.
ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, నష్టం తీవ్రతను అంచనా వేసే బాధ్యతను సిట్‌కు అప్పగించారు. అగ్ని ప్రమాదంలో ఈవీఎంలు పూర్తిగా కాలిపోవడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉన్నట్లు ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘‘అగ్నిప్రమాదంలో అంతుచిక్కని రీతిలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. 4,000 కంట్రోల్ యూనిట్లు, 4,000 బ్యాలెట్ యూనిట్లు 4,000 వీవీప్యాట్‌లు బూడిదగా మారిపోయాయి’’అని పేర్కొంది.


