
దేవఘర్: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న బస్సు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేవఘర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భక్తులతో వెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న వాహనాన్ని ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో ఈ ఘటనపై స్పందిస్తూ తన నియోజకవర్గమైన దేవఘర్‌లో కన్వర్ యాత్ర సందర్భంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నదని, బస్సు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
BJP MP Nishikant Dubey (@nishikant_dubey) posts, " लोकसभा के देवघर में श्रावण मास में कांवर यात्रा के दौरान बस और ट्रक के दुर्घटनाग्रस्त होने के कारण 18 श्रद्धालुओं की मौत हो गई है । बाबा बैद्यनाथ जी उनके परिजनों को दुख सहने की शक्ति प्रदान करें" pic.twitter.com/o6axGqRi85
— Press Trust of India (@PTI_News) July 29, 2025
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఒక అధికారి తెలిపారు. ఈ ఘటన దరిమిలా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది.