శెభాష్‌ కామ్య..! | Sakshi
Sakshi News home page

శెభాష్‌ కామ్య..!

Published Fri, May 24 2024 4:37 AM

16 years old Kamya Karthikeyan became the youngest Indian to climb Mount Everest

16 ఏళ్లకే ఎవరెస్ట్‌ను అధిరోహించిన కామ్య కార్తికేయన్‌

మొట్టమొదటి భారతీయ పిన్న వయస్కురాలిగా రికార్డు 

ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బాలిక

తండ్రితో కలిసి విజయవంతంగా పర్వతారోహణ

వివరాలను వెల్లడించిన టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌

ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించిన ఘనతకు అడుగుదూరం

జంషెడ్‌పూర్‌: కామ్య కార్తికేయన్‌. 16 ఏళ్లు. చదివేది ప్లస్‌టూ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని నేపాల్‌ వైపు నుంచి చిన్న వయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బాలికగా కూడా నిలిచింది. ఈ నెల 20వ తేదీన తండ్రితో కలిసి ఆమె ఈ ఘనత సాధించినట్లు టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌(టీఎస్‌ఏఎఫ్‌) గురువారం తెలిపింది.

 ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన రికార్డు సాధించేందుకు కామ్య మరో అడుగు దూరంలోనే ఉన్నట్లు టీఎస్‌ఏఎఫ్‌ చైర్మన్‌ చాణక్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమనే విషయం కామ్య రుజువు చేసిందని, సాహసికులకు ఆమె ప్రేరణగా నిలిచిందని తెలిపారు. ఈ సంస్థే కామ్యకు సహాయ సహకారాలు అందిస్తోంది. 

ఏప్రిల్‌ ఆరో తేదీన తన బృందంతోపాటు కఠ్మాండుకు చేరుకున్న కామ్య..పూర్తిస్థాయి సన్నద్ధతతో మే 16వ తేదీన ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి తండ్రి కార్తికేయన్‌తోపాటు సాహసయాత్రను ప్రారంభించింది. తండ్రితో కలిసి మే 20వ తేదీన వేకువజామున 8,848 మీటర్ల ఎత్తయిన శిఖరంపైకి చేరుకుందని టీఎస్‌ఏఎఫ్‌ వివరించింది. 

తాజా విజయంతో ఆరు ఘనతలను సాధించిన కామ్య.. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలన్న ధ్యేయానికి కేవలం అడుగు దూరంలో నిలిచిందని వెస్టర్న్‌ నేవీ కమాండ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొంది. ఏడో లక్ష్యమైన అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌ మాస్సిఫ్‌ను వచ్చే డిసెంబర్‌లో అధిరోహించేందుకు సిద్ధమవుతున్న కామ్య.. ఈ అరుదైన ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర పుటల్లో నిలవాలని కోరుకుంటున్నట్లు వివరించింది.

నేవీ కమాండర్‌ ఎస్‌.కార్తికేయన్‌ కుమార్తె కామ్య. ముంబైలోని నేవీ చిల్డ్రన్స్‌ స్కూల్‌లో ప్లస్‌టూ చదువుకుంటోంది. పర్వతారోహణ అంటే కామ్యకు చిన్ననాటి నుంచే ఎంతో ఆసక్తి. ఏడో ఏటనే, 2015లో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశిల పర్వతాన్ని అధిరోహించి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016లో 13,500 అడుగుల ఎత్తున్న మరింత కఠినమైన హరి కీ దున్‌ను, కేదార్‌నాథ్‌ శిఖరాలను అవలీలగా ఎక్కింది. 

అదేవిధంగా, 16,400 అడుగుల ఎత్తులో రూప్‌కుండ్‌ సరస్సుకు చేరుకుంది. అసా ధారణ విజయాలను నమోదు చేసిన బాలల కిచ్చే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల శక్తి పుర స్కారం కూడా కామ్య అందుకుంది. 2017లో నేపాల్‌లోని 17,600 అడుగుల ఎత్తున ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు చేరుకుని ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది.

ఎవరెస్ట్‌ కీ బేటీ– ప్రత్యేక కథనం ఫ్యామిలీలో

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement