
నామరూపాలు కోల్పోయిన బస్సు
బిలాస్‌పూర్ వద్ద బస్సుపై విరిగిపడిన కొండచరియలు
బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
ముగ్గురిని కాపాడిన సహాయక బృందాలు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
మృతుల కుటుంబాలకు ప్రధాని రూ. 2 లక్షల సహాయం
15 మంది మృతి.. నుజ్జయిన బస్సు
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 15 మంది మరణించారు. బిలాస్‌పూర్ జిల్లా ఝన్‌దత్త నియోజకవర్గంలోని భలుఘాట్ బ్రిడ్జి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుపై సాయంత్రం 6.30 గంటల సమయంలో భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దపెద్ద కొండరాళ్లు, బురద మట్టి కింద బస్సు మొత్తం కూరుకుపోయి నుజ్జయ్యింది. మరోతన్–కలౌల్ మధ్య తిరిగే ఈ బస్సులో ప్రమాదం సమయంలో 30–35 మంది ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు ప్రయాణికులను కాపాడినట్టు బిలాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ రాహుల్‌కుమార్ తెలిపారు. శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీసినట్టు ఝన్‌దత్త ఎమ్మెల్యే జేఆర్ కత్వాల్ చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా సహాయచర్యల్లో పాల్గొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రి సమయం కావటంతో సెల్‌ఫోన్లు, టార్చిలైట్ల వెలుగులో సహాయక చర్యలు చేపట్టారు. ఒక జేసీబీతో శిథిలాలను తొలగిస్తుండగా, సహాయక సిబ్బంది మరోవైపు పారలతో మట్టిని తవ్వి బస్సులోనివారి కోసం వెదుకుతున్న వీడియోలు మీడియాలో ప్రసారమయ్యాయి.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
బిలాస్‌పూర్ ప్రమాదంపై హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ సుక్కు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ఎక్స్‌లో తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు సకల వనరులు ఉపయోగించి సహాయక చర్యలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రయాణికుల మరణంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పన ఆర్థికసాయం ప్రకటించారు. సుఖ్విందర్ సింగ్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.