వచ్చే నెల నుంచి ప్రత్యేక డ్రైవ్..
సిబ్బంది కొరతే కారణమా..?
నారాయణపేట: పురపాలికల్లో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత అడ్డంకిగా మారుతోందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని నాలుగు పురపాలికల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి పన్ను మొత్తం రూ.10.15 కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.3.13 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. మరో రూ.7.01 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ మొత్తాన్ని రాబట్టడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ఓ వైపు వార్డు అధికారుల కొరత, మరోవైపు సంక్షేమ పథకాల అమలు, ఇతర పరిపాలనా బాధ్యతలతో అధికారులు బిజీగా ఉండటంతో పన్నువసూళ్లపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించడం లేదన్న చర్చ సాగుతోంది.
జిల్లాకేంద్రంలో రూ.3.29 కోట్ల బకాయిలు..
పేట మున్సిపాలిటీలో 9,531 ఆస్తులకు సంబంధించి రూ.4.79 కోట్ల పన్ను డిమాండ్ ఉంది. కాగా ఇప్పటి వరకు రూ.1.50 కోట్లు మాత్రమే వసూలు కాగా.. ఇంకా రూ.3.29 కోట్లు రావాల్సి ఉంది. కేవలం 31 శాతమే వసూలు కావడం గమనార్హం. జిల్లాకేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా పట్టణాల్లో వసూళ్ల పురోగతి ఎలా ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మద్దూరులో 50 శాతమే..
మద్దూరు మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ ఆస్తులపై రూ.60.73 లక్షల పన్ను డిమాండ్ ఉండగా.. ఇప్పటి వరకు రూ.30.90 లక్షలు మాత్రమే వసూలయ్యా యి. వసూళ్ల శాతం 50.88గా నమోదైంది. ఇంకా రూ.29.83 లక్షలు బకాయిగా మిగిలాయి. మున్సిపాలిటీలో 3,315 అసెస్‌మెంట్లు ఉండగా 1,857 అసెస్‌మెంట్ల పన్ను వసూలుకాగా, మరో 1,458 అసెస్‌మెంట్ల బకాయిలున్నాయి. నివాస ఆస్తులపై రూ.38.26 లక్షల డిమాండ్‌కుగాను రూ.17.12 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. కేవలం 44.75 శాతం వసూళ్లు నమోదయ్యాయి. నాన్ రెసిడెన్షియల్ విభాగంలో 69.13 శాతం, మిక్స్‌డ్ విభాగంలో 46.99 శాతం వసూళ్లు జరిగాయి. మిగిలిన బకాయిలను గడువులోగా వసూలు చేయడం మున్సిపల్ అధికారులకు సవాల్‌గా మారింది.
కోస్గి వెనుకంజ..
కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని నివాస, వాణిజ్య, మిశ్రమ, ప్రభుత్వ భవనాలకు సంబంధించి రూ.2.44 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.72.15 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. అంటే 29.57 శాతం వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. ఇంకా రూ.1.71 కోట్ల పన్ను బకాయి ఉండటం గమనార్హం. మొత్తం 6,607 అసె స్‌మెంట్లు ఉండగా.. ఇప్పటి వరకు 2,237 పన్ను చెల్లింపులు కాగా మరో 4,370 అసెస్‌మెంట్లకు సంబంధించి బకాయిలు ఉన్నాయి. ఇందులో నివాస భవనాలకు సంబంధించి 5,703 అసెస్‌మెంట్లపై రూ.142.91 లక్షల డిమాండ్ ఉండగా.. రూ.38.59 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.104.32 లక్షలు బకాయి ఉంది. వసూళ్ల శాతం 27 మాత్రమే. వాణిజ్యేతర భవనాలపై రూ.66.52 లక్షల డిమాండ్‌కుగాను రూ.18.01 లక్షలు, మిశ్రమ భవనాలపై రూ.32.94 లక్షల డిమాండ్‌కుగాను రూ.15.55 లక్షలు వసూలయ్యాయి. ప్రభుత్వ భవనాలకు సంబంధించి రూ.1.66 లక్షల డిమాండ్ ఉన్నప్పటికీ వసూలు కాలేదు.
అధికారులు బిజీ..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల గుర్తింపు, దరఖాస్తుల పరిశీలన, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి కార్యక్రమాల్లో పుర అధికారులు నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలో పట్టణాల్లో పన్నువసూళ్లకు ప్రత్యేక బృందాలను కేటాయించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యాలు.. మరోవైపు మున్సిపాలిటీల సొంత ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత అధికారులకు సవాల్‌గా మారింది.
ఆదాయమే ఆధారం..
పుర నిర్వహణలో ఆస్తిపన్ను ఆదాయం కీలకం. పారిశుద్ధ్యం, వీధిదీపాలు, తాగునీటి సరఫరా, ఇతర పౌరసేవల నిర్వహణతో పాటు సిబ్బంది వేతనాలు, రోజువారీ నిర్వహణ ఖర్చులకు నిధులు అవసరం. సొంత ఆదాయం ఆశించిన స్థాయిలో సమకూరకపోతే నిర్వహణ భారంగా మారనుంది. ఈ నేపథ్యంలో పన్నువసూళ్లను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆస్తిపన్ను వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేస్తాం. వారు ఇంటింటికి వెళ్లి వసూలు చేస్తారు. ఇంకా నాలుగు నెలల గడు వు ఉండటంతో కాస్త నెమ్మ దిగా కొనసాగుతోంది. డిసెంబర్ నుంచి ప్రత్యే క డ్రైవ్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. పాతబకాయిలపై దృష్టి సారిస్తాం.
– ఎన్.శంకర్, పుర కమిషనర్, నారాయణపేట
నాలుగు పురపాలికల్లో రూ.7 కోట్ల బకాయిలు
ఇప్పటి వరకు వసూలైంది 31 శాతమే..
అత్యల్పంగా మక్తల్‌లో 26 శాతం.. మద్దూరులో 50 శాతం
నారాయణపేటలోనే
రూ.3.29 కోట్ల బకాయిలు
పురపాలికల్లో వార్డుల వారీగా పన్నువసూళ్లను పర్యవేక్షించేందుకు సిబ్బంది కీలకం. ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందించడం, చెల్లింపులపై అవగాహన కల్పించడం వంటి పనులు వార్డుస్థాయిలో జరగాలి. అయితే వార్డు ఆఫీసర్ల కొర త, ఉన్న సిబ్బందిపై ఇతర బాధ్యతల భారం వసూళ్ల వేగాన్ని ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


