కోస్గి రూరల్: పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటనకు ముందే ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పీఆర్సీని ప్రకటించాలని, రాష్ట్రంలో విశ్రాంత పురుష ఉద్యోగులకు 2027 కానుకగా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారు రూ.6 కోట్లు మంజూరు చేశారని.. మిగిలిన వారికి సైతం ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలన్నారు. ఈహెచ్‌ఎస్‌లో భాగంగా ఉద్యోగులకు ప్రత్యేక చికిత్స అందించడం లేదని.. హైదరాబాద్‌లో 17 కార్పొరేట్ ఆస్పత్రులున్నా.. యశోద, కిమ్స్, అపోలో గ్రూప్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు సరైన చికిత్స అందించడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు, 398 వేతనం కింద పనిచేస్తున్న వారికి నోషనల్ ఇక్రిమెంట్లు ఇవ్వాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా.. హైదరాబాద్‌లోనే 90 వేల మంది ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పెన్షనర్ల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉస్మాన్‌పాషా, జిల్లా అధ్యక్షుడు మనోహర్‌గౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి సంతోష్‌కుమార్ ఉన్నారు.
పడమటి అంజన్న
ఆలయంలో తులాభారం
మక్తల్: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పండ్లతో తులాభారం నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆలయ ఆవరణలో చిన్నరథం, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని త్రాసులో శ్రీసీతారామ లక్ష్మణ, హనుమంతుడి ఉత్సవ విగ్రహాలను ఉంచి వివిధ రకాల పండ్లు, పూలు, నాణెములు, పటిక బెల్లం, నేతి మిఠాయిలు ఉంచి తులాభారం చేశారు. ఆలయ చైర్మన్ ప్రాణేశ్‌చారి, ఈఓ నిత్యానందం, భక్తులు పాల్గొన్నారు.


