ఆధునికీకరణకు అడ్డంకులు..! | - | Sakshi
Sakshi News home page

ఆధునికీకరణకు అడ్డంకులు..!

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దదైన మహబూబ్‌నగర్‌ ప్రధాన రైల్వేస్టేషన్‌ను స్వాతంత్య్రానికి ముందే నిజాం కాలంలో నిర్మించారు. ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోనందున ఈ స్టేషన్‌ను అమృత్‌ పథకం కింద సుమారు రూ.44 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ఏడాది క్రితమే ఈ పనులు ఆరంభమైనప్పటికీ కొన్ని నెలలుగా ఎంతో నెమ్మదిగా కొనసా..గుతున్నాయి. మొదట్లో వచ్చే నెలాఖరు నాటికే ఈ పనులన్నీ పూర్తవుతాయని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు భావించారు. అయితే ఇప్పటివరకు కేవలం 45 శాతం మాత్రమే చేపట్టారు. కాగా, గత ఆగస్టు 31న జిల్లాకేంద్రానికి వచ్చి పరిశీలించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వచ్చే ఏడాది మార్చి నాటికి ఎలాగైనా పూర్తవుతాయని ప్రకటించారు. అయితే వాస్తవానికి ఈ ఐదు నెలల్లో అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

పూర్తయింది ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఒక్కటే..

ఆధునికీకరణలో భాగంగా రెండు నెలల క్రితం ఎలాగోలా పాదచారుల వంతెన (ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి)ను అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఇక్కడ ఎడమ వైపు ఒకే పాదచారుల వంతెన ఎంతో ఇరుకుగా ఉండేది. దీనిపై నుంచే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. ప్రస్తుతం విశాలమైన కొత్తది నిర్మించడంతో పాత దానిని పూర్తిగా తొలగించారు. దీని నుంచే ప్రయాణికులు రెండు, మూడు, నాలుగో ప్లాట్‌ ఫారాలకు చేరుకుంటున్నారు. పక్కనే అధునాతన లిఫ్ట్‌ నిర్మిస్తుండటంతో పూర్తయ్యాక దీనికి అనుసంధానం చేయనున్నారు. సునాయసంగా పైకి, కిందికి వెళ్లడానికి ఎస్కలేటర్లు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా ఈ పనులు మొదలు కాలేదు. పాత భవనం స్థానంలో అధునాతన టర్మినల్‌తో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు కుడి, ఎడమ వైపున భారీ స్థాయిలో లాన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలాఉండగా టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌, రిజర్వేషన్‌, విచారణ విభాగాలను ప్రవేశద్వారం వద్ద ఉన్న తాత్కాలిక భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఇక పరిపాలన భవనాన్ని సమీపంలోని రైల్వే విశ్రాంతి భవనం (ఫంక్షన్‌ హాల్‌)లో కొనసాగిస్తున్నారు.

అమృత్‌ పథకం కింద రూ.44 కోట్లతో పనులు

ఏడాది గడిచినా 45 శాతమే పూర్తి

మార్చి నాటికి పూర్తయ్యేనా?

అందుబాటులోకి వచ్చిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఒక్కటే

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement