బ్యాంకర్లు రైతులకు అండగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాంకర్లు రైతులకు అండగా నిలవాలి

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

నారాయణపేట: తీవ్ర వర్షాభావంతో పంటలు నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బ్యాంకర్లు అండగా నిలవాలని కలెక్టర్‌ ప్రియాంక సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెనన్స్‌ హాల్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన ప్రత్యేక జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ (స్పెషల్‌ డీసీసీ) సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతుల రుణాల చెల్లింపులపై మారటోరియం అమలు చేయడంతో పాటు రుణాల రీ–షెడ్యూలింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుణాల వసూలు పేరుతో రైతులపై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 45 శాతం, గతేడాదితో పోలిస్తే సుమారు 65 శాతం లోటు వర్షపాతం నమోదైందని.. రాష్ట్రంలో అత్యంత తీవ్ర వర్షాభావ ప్రభావానికి గురైన జిల్లాల్లో ఒకటిగా ఉందన్నారు. శాసీ్త్రయ పరిశీలన అనంతరం జిల్లాలోని మొత్తం 13 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతుల దయనీయ పరిస్థితులపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో సమీక్షించడంతో పాటు శాసనసభలోనూ చర్చించిందని వివరించారు. రుణాల చెల్లింపులపై మారటోరియం, రుణాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా రైతులకు ఉపశమనం కల్పించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు ప్రభుత్వ ఆదేశాలు, ఆర్‌బీఐ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. రుణ వసూలు విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతపు చర్యలకు పాల్పడటం తగదన్నారు. అవసరమైన చోట రుణాల రీషెడ్యూలింగ్‌కు చర్యలు చేపట్టి రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని సూచించారు. బ్యాంకుల ప్రధాన అధికారులు, రీజినల్‌ మేనేజర్లు, డివిజనల్‌ మేనేజర్లు తమ పరిధిలోని మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని.. ఉత్తర్వులు పంపడంతో సరిపెట్టకుండా శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా మార్గదర్శకాలను వివరించాలన్నారు. రైతులకు మరింత ఆర్థిక భారం కలగకుండా మానవతా దక్పథంతో వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రతి బ్యాంకు శాఖలో అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, డీఆర్డీఓ వెంకట్రాములు, డీఏఓ సక్రియానాయక్‌, జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సురేష్‌ ఆత్రేయ, వివిధ బ్యాంకుల మేనేజర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement