అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన కుడి, ఎడమ కాల్వలతో పాటు సమాంతర కాల్వకు శనివారం నీటిని విడుదల చేసినట్లు ఏఈ సుదర్శన్ తెలిపారు. ఆయకట్టుకు వారాబందీ విధానంలో ప్రాజెక్టు అధికారులు సాగునీటిని వదులుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం నుంచి 4 రోజుల పాటు నిరంతరాయంగా కాల్వలకు నీటిని వదలనున్నట్లు వెల్లడించారు. ప్రధాన ఎడమకాల్వకు 1,140 క్యూసెక్కులు, కుడి కాల్వకు 730, సమాంతర కాల్వకు 1,100, భీమా ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు.. మొత్తంగా 3,033 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు మాత్రమే సాగునీటిని వదలాలని.. సమాంతర కాల్వకు కేవలం వరద వచ్చినప్పుడే వదలాలని అమరచింత, ఆత్మకూర్ మండలాల ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమాంతర కాల్వ ద్వారా ప్రాజెక్టులో ఉన్న నిల్వనీటిని దిగువకు తీసుకెళ్లే కుట్రలు మానుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు. జలాశయంలో ప్రస్తుతం 3.116 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.


