పాలమూరులో 3 గ్రంథాల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పాలమూరులో 3 గ్రంథాల ఆవిష్కరణ

Nov 1 2026 7:13 AM | Updated on Nov 1 2026 7:13 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌ శ్రీసీతారామాంజనేయ గ్రంథాలయంలో శనివారం మూడు గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు సాహితీ వికాస వేదిక, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవి గన్నోజు శ్రీనివాసాచారి రచించిన ‘శ్రీనివాస శతకం’, ‘గన్నోజు సప్తపది’, డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి సాహిత్య వ్యాసాలు మొదటి భాగం పుస్తకాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ, ప్రముఖ వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న మాట్లాడుతూ.. ఒకే వేదికపై మూడు గ్రంథాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కవి తనను తాను మరిచి రచన చేసినప్పుడే గొప్ప సాహిత్యం ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త కవులు, రచయితలు వెలుగులోకి రావడం శుభపరిణామమన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప మాట్లాడుతూ.. ‘శ్రీనివాస శతకం’లోని పద్యాలు మానవ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ నీతిని బోధిస్తాయని అన్నారు. ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి మూడు గ్రంథాల సాహిత్య విలువలను వివరించారు. పల్లెర్ల రాంమోహనరావు, ప్రొఫెసర్‌ కె.కృష్ణమూర్తి, కపిలవాయి అశోక్‌బాబు, గన్నోజు పద్మావతి, డి.రాములు యాదవ్‌, రావూరి వనజ, జి.శాంతారెడ్డి, చుక్కాయిపల్లి శ్రీదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement