● పొలంలో పంట కోస్తుండగాప్రమాదం
● పొన్నకల్‌లో తీవ్ర విషాదం
అడ్డాకుల: రెక్కల కష్టంతో కుటుంబాన్ని నడిపించే ఆ తల్లి.. పొలంలో వరి కోత పనులు జరుగుతుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పిల్లలకు తీరని లోటు మిగిల్చింది. అడ్డాకుల మండలంలోని పొన్నకల్‌కి చెందిన కొత్తకాపు లక్ష్మి (35) శుక్రవారం సాయంత్రం వరి కోత యంత్రం తగిలి మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. లక్ష్మి భర్త చెన్నారెడ్డి తన వ్యవసాయ పొలంలో వరి సాగు చేశాడు. పంట కోత కోసం శుక్రవారం సాయంత్రం యంత్రాన్ని తీసుకొచ్చారు. కోత పనులు జరుగుతున్న సమయంలో యంత్రం లక్ష్మి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందింది. లక్ష్మికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన తల్లి ఆకస్మికంగా దూరం కావడంతో పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో పొన్నకల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.


