ఈ ఫొటోలోని రైతు పేరు పూజారి మహదేవ్. మాగనూర్ మండలం భైరంపల్లి గ్రామం. ఈయన తనకున్న 9 ఎకరాల్లో పత్తి సాగు చేసి సుమారు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. సకాలంలో వర్షాలు లేక పంట ఎదుగుదల మందగించగా.. మరోవైపు ఎర్ర తెగులు సోకి పూత, కాయలు రాలిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. పంట కాపాడుకొనేందుకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తుండగా.. దిగుబడి మాత్రం పెరిగే అవకాశం లేదని రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట: పత్తి రైతు ఆశలు పూత దశలోనే రాలిపోతున్నాయి. ఈసారి వర్షాభావం, తెగుళ్లు, చీడపీడలు పట్టి పీడిస్తున్నాయి. మొక్కల ఎదుగుదల మందగించడం, పూత, కాయలు తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో ఎర్ర తెగులు ప్రభావం కనిపించడంతో దిగుబడిపై రైతుల్లో ఆందోళన మొదలైంది.
జిల్లావ్యాప్తంగా సుమారు 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. ఈసారి మాత్రం కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడే వస్తుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరిగాయి. పంటను కాపాడుకునేందుకు అదనంగా మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. దిగుబడి తగ్గితే పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
లోటు వర్షపాతం..
జిల్లాలో జూనన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే కాలంలో 598.9 మి.మీ. వర్షపాతం ఉండగా.. ఈసారి ఏకంగా 55 శాతం తక్కువగా నమోదైంది. ఈ తేడా వర్షాధార పత్తి సాగుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతోంది. వర్షాల మధ్య విరామం, తేమ లోపంతో రైతుల్లో దిగుబడిపై ఆందోళన మొదలైంది. వర్షాల మధ్య అంతరాలు పెరగడం, తేమ నిలవకపోవడం, ఎండ తీవ్రతతో పగటి సమయంలో మొక్కలు వాడిపోవడం పత్తి రైతులకు మరో సమస్యగా మారింది.
పెరగని పత్తి పంట.. దిగుబడిపై ప్రభావం
జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో సాగు
వర్షాభావ పరిస్థితులతో రైతన్న అయోమయం
పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి
ఎర్ర తెగులు..
పత్తి పంటకు ఎర్ర తెగులు, ఇతర చీడపీడల బెడద వెంటాడుతుండటంతో మొక్కలు ఆశించిన స్థాయిలో ఎదగడం లేదు. దీంతో పూత, కాయల సంఖ్య తగ్గుతుండటంతో దిగుబడులపై రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భారీగా పెరగడంతో పెట్టుబడులు పెరిగాయి. పంట చేతికొచ్చే నాటికి ఖర్చులు కూడా తిరిగొస్తాయా అన్న సందేహం నెలకొంది. తొలినాళ్లలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో పంట పెరుగుదలపై ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పత్తి మొక్కలు ఎర్రబడటం, ఆకులు బలహీనపడటం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.
పూతకు ముందేపురుగుల బెడద..
పత్తి మొక్కలు ఎదిగి పూత, కాయల దశకు చేరుకోవాల్సిన సమయంలో తెగుళ్లు, చీడపీడలు రైతులను కలవరపెడుతున్నాయి. తెగు ళ్ల నివారణకు మందులు పిచికారీ చేయాల్సి వస్తుండటంతో అదనపు భారం పడుతోంది. మందుల ఖర్చుతో పాటు పిచికారీ కూలీ కూడా రైతులపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది.


