13 ఏళ్లకే జాతీయస్థాయిలో పతకం
ఒలింపిక్స్ మెడలే లక్ష్యమంటున్న బాలమణి
రెజ్లింగ్‌లో సత్తా చాటుతున్న పాలమూరు ఆడబిడ్డలు
● మట్టి బరిలో మొదలైన ప్రస్థానం.. జాతీయ వేదికపై పతకాల వేట
● అంతర్జాతీయస్థాయిలో బరిలోకి దూసుకెళ్లే లక్ష్యం..
మందిపల్లిపాతతండాకు చెందిన 13 ఏళ్ల సీతామహాలక్ష్మి ధన్వాడలో 9వ తరగతి చదువుతోంది. చిన్న వయసులోనే రెజ్లింగ్ బరిలో అడుగుపెట్టి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటోంది. 2025లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అండర్–14 ఎస్‌జీఎఫ్‌ఐ నేషనల్స్, ఈ ఏడాది తమిళనాడులో జరిగిన అండర్–15 నేషనల్స్‌లో పాల్గొంది. న్యూఢిల్లీలో జరిగిన అండర్–14 ఎస్‌జీఎఫ్ జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించి తన సత్తా చాటింది. నిరంతర శిక్షణతో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని సీతామహాలక్ష్మి చెబుతోంది.
మందిపల్లిపాతతండాకు చెందిన నాగలక్ష్మి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. చిన్ననాటి నుంచే రెజ్లింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 2023లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సబ్ జూనియర్, 2024లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్–17 ఎస్‌జీఎఫ్‌ఐ, ఉత్తరాఖండ్ సబ్ జూనియర్, తమిళనాడు ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొంది. 2025లో రాజస్థాన్ సీనియర్ నేషనల్, ఛత్తీస్‌గఢ్ అండర్–20 నేషనల్స్‌లోనూ పోటీ పడింది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన పోటీల్లో వరుసగా మెరుగైన ప్రదర్శనతో 2025 వీర తెలంగాణ కేసరి, 2026లో తెలంగాణ కేసరి బిరుదును దక్కించుకుంది. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఖేలో ఇండియా జాతీయ పోటీల్లో 57 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించాలన్నదే తన కల అని నాగలక్ష్మి అంటోంది.
మందిపల్లికొత్తతండాకు చెందిన కె.బాలమణి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇప్పటివరకు నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. 2023లో తమిళనాడులో జరిగిన అండర్–15 నేషనల్స్, ఉత్తరాఖండ్ సబ్ జూనియర్ నేషనల్స్, 2024లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్–17 నేషనల్స్, 2025లో అండర్–17 ఎస్‌జీఎఫ్‌ఐ నేషనల్స్‌లో పోటీ పడింది. నిరంతర సాధనతో అంతర్జాతీయస్థాయికి ఎదిగి ఒలింపిక్స్‌లో భారత జట్టు తరఫున బరిలోకి దిగి పతకం సాధించాలన్నదే తన ఆశయమని బాలమణి చెబుతోంది.


