మద్దూరులో పర్యటించి..
కోస్గి: కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక హెచ్చరించారు. మంగళవారం స్థానిక పుర కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల అధికారులతో సమావేశమై అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వసతిగృహాలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులపై శ్రద్ధ వహించాలని, వచ్చే విద్యాసంవత్సరం నాటికి వినియోగంలోకి తీసుకొచ్చేలా పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాలు గుర్తించాలని కోరారు. మండలాలకు కేటాయించిన అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పరోగతిని పరిశీలించాలన్నారు. పింఛన్ దరఖాస్తుల డేటా ఎంట్రీ, పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ఫిర్యాదులు రాకుండా అర్హులకే ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్‌రెడ్డి మద్దూర్, కోస్గి పురపాలికలకు మంజూరైన నిధులు, కొనసాగుతున్న అభివృద్ధి పనులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంతకుముందు కలెక్టర్ గుండుమాల్‌లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, వసతిగృహం, మండల సముదాయ నిర్మాణ పనులను పరిశీలించి గడువుగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పుర చైర్మన్ నాగులపల్లి నరేందర్, కోస్గి, మద్దూర్ మున్సిపల్ కమిషనర్లు నాగరాజు, శ్రీకాంత్, తహసీల్దార్ కళ్యాణి, ఎంపీడీఓలు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొత్తపల్లి: మద్దూరులోని చింతల్‌దిన్నె మార్గంలో రూ.30 కోట్లతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల భవనాన్ని కలెక్టర్ ప్రియాంక మంగళవారం పరిశీలించారు. అకాడమిక బ్లాక్, డైనింగ్‌హాల్, ప్రిన్సిపాల్ క్వార్టర్స్, టాయిలెట్ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిబంధన ప్రకారం నవంబర్ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాల్సి ఉందని, వచ్చే మార్చి నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం రూ.6.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తరగతి గదుల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ మహేశ్‌గౌడ్, పుర కమిషనర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.


