నారాయణపేట: వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని.. విధులకు వెళ్లే ముందు శుభ్రం చేయడంతో పాటు టైర్లు, బ్రేకులు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్యాటరీ, లైట్లు, ఇండికేటర్లు, హారనన్ తదితరాలను పరిశీలించాలని అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్ డ్రైవర్లకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసు వాహనాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ, పెట్రోలింగ్, అత్యవసర సేవలు, నేరాల నియంత్రణలో పోలీసు వాహనాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. వాహనాల మెకానిజం, ప్రాథమిక సాంకేతిక అంశాలపై ప్రతి డ్రైవర్‌కు అవగాహన ఉండాలన్నారు. వాహనంలో సాంకేతిక సమస్య గుర్తించిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతు చేయించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో వాహనం మొరాయిస్తే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వాహనాల నిర్వహణ, భద్రత, డ్రైవర్ల పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తనిఖీల్లో ఎంటీఓ ఆర్‌ఐ విజయ్‌భాస్కర్ తదితరులు ఉన్నారు.


