నారాయణపేట: వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, విష జ్వరాలు, విరేచనాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి ఒకరోజు ‘డ్రై డే‘ పాటించి ఇంటి లోపల, బయట నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటిట్యాంకులు, డ్రమ్ములు, బకెట్లు, ఇతర నీటి నిల్వ పాత్రలపై తప్పనిసరిగా మూతపెట్టి ఉంచాలని, దోమ తెరలు, దోమ నివారణ సాధనాలను వినియోగించడంతో దోమ కాటుకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. తాగునీటిని మరిగించి లేదా శుద్ధిచేసి మాత్రమే వినియోగించాలని.. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, వారి సలహా లేకుండా మందులు వాడరాదన్నారు. సీజనల్ వ్యాధులపై సమాచారం, సలహాలు, సాయం కోసం జిల్లా ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్ నంబర్ 76800 50297ను సంప్రదించాలని సూచించారు.
వైద్య కళాశాలలో
సీట్లు పెంచాలి : బీఆర్‌ఎస్
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుతం ఉన్న 50 ఎంబీబీఎస్ సీట్లను 150కు పెంచాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. నారాయణపేట కళాశాలను మాత్రం 50 సీట్లకే పరిమితం చేయడం జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే ఆశతో ఉన్నప్పటికీ, పరిమిత సీట్ల కారణంగా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన నారాయణపేట జిల్లాలో విద్యా సౌకర్యాలను మరింత మెరుగుపర్చడం ప్రభుత్వ బాధ్యతన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించి సీట్ల సంఖ్య పెంపునకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్, జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
వైభవంగా
జగన్నాథుడి రథయాత్ర
నారాయణపేట: జిల్లాకేంద్రంలో సోమవారం పూరి జగన్నాథుడి రథయాత్రను వైభవంగా నిర్వహించారు. సరాఫ్‌బజార్‌లోని బసవేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర మెయిన్‌న్‌రోడ్, పాత బస్టాండ్, సత్యనారాయణ చౌరస్తా మీదుగా ఎస్‌ఆర్ గార్డెన్స్ వరకు సాగింది. వందలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ భక్తిగీతాలు ఆలపించారు. కోలాట ప్రదర్శనలు, భజన బృందాల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్గమధ్యంలో భక్తులు పూల చల్లుతూ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి 56 రకాల మహా నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు.
పీయూలో
పీజీ పరీక్షలు ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని వీసీ శ్రీనివాస్ తనిఖీ చేశారు. పరీక్షకేంద్రాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపల్ మధుసూదన్‌రెడ్డి, కృష్ణయ్య, గౌస్ తదితరులు ఉన్నారు.


