రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

కొల్లాపూర్‌ రూరల్‌: రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మండలంలోని సోమశిలలో కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి గ్రామాలకు చెందిన రైతుల భూ సమస్యపై కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌తో కలిసి ఫారెస్టు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రైతుల సమక్షంలోనే ఒక్కో సమస్యను పరిశీలిస్తూ.. అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గ్రామానికి చెందిన రైతులను విడివిడిగా పిలిపించి వారి సమస్యలను మంత్రి స్వయంగా ఆలకించారు. ప్రతి కేసు ప్రస్తుతం ఏ దశలో ఉందో.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని అటవీ శాఖ నిబంధనలతో, మరికొన్ని రెవెన్యూ రికార్డుల్లో లోపాలతో, ఇంకొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్ల వివాదాల వల్ల రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతు భూమి రైతుకు జీవనాధారం అని, అలాంటి భూములకు సంబంధించిన వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగడం వల్ల రైతులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కాబట్టి వారిని కార్యాలయాల చుట్టూ తిరిగించుకోకుండా అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతు రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్‌లు, పాత పట్టాలు, సర్వే నంబర్లు, హద్దులు, సరిహద్దుల వివరాలు అందుబాటులో ఉన్న ఇతర రికార్డులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయానికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర, ఆర్డీఓ బన్సీలాల్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement