● ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం
● 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక
● ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఏళ్ల క్రితం వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
97.68 శాతం పంపిణీ పూర్తి
ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు శ్రమిస్తున్నారు.
తిరిగి ఇవ్వడంలో జాప్యం
బీఎల్‌ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలిచ్చి వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని బీఎల్‌ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్‌ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్‌గా మారింది.


