నారాయణపేట: స్థానిక పుర కౌన్సిల్ సమావేశం శనివారం వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య కొనసాగింది. చైర్‌పర్సనన్ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు, కౌన్సిల్ సమావేశాలకు మీడియా ప్రవేశం, వార్డుల అభివృద్ధికి నిధులు, పారిశుద్ధ్య సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో సమావేశం వాడివేడీగా సాగింది. చివరకు మీడియాకు అనుమతి కల్పించకపోవడం, వార్డుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు సమావేశాన్ని వాకౌట్ చేశారు. అనంతరం బీజేపీ సభ్యులతోనే చైర్‌పర్సనన్ కొండ శ్వేత అధ్యక్షతన సమావేశం కొనసాగింది.
మీడియా ప్రవేశంపై తొలి నుంచే వివాదం..
సమావేశం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు మీడియాను కౌన్సిల్ సమావేశానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమావేశంలో మీడియాకు ప్రవేశం లేదని కమిషనర్ శంకర్ స్పష్టం చేయడంతో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే చైర్‌పర్సన్ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు వెచ్చించడాన్ని కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కౌన్సిలర్లతో చర్చించకుండా బిల్లును తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజల అవసరాల కంటే చాంబర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. చెత్త తరలింపు ఆటోల మరమ్మతు, పారిశుద్ధ్య కార్మికుల సౌకర్యాల కల్పనకు నిధులు లేవంటూ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అవే నిధులతో వార్డుల్లో డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైనన్ లీకేజీలు తదితర సమస్యలు పరిష్కరించవచ్చని సూచించారు.
అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మాటల యుద్ధం
అభివృద్ధి పనులకు నిధుల్లేవు... చైర్‌పర్సన్ చాంబర్‌కు రూ.22 లక్షలా?
మీడియాకు ప్రవేశం కల్పించాలంటూ కాంగ్రెస్, ఎంఐఎం వాకౌట్


