చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

Jul 5 2026 8:02 AM | Updated on Jul 5 2026 8:02 AM

నారాయణపేట రూరల్‌: పాఠశాల విద్య పూర్తిచేసి కళాశాలలకు వచ్చిన విద్యార్థులు తప్పుడు స్నేహాలతో చెడు అలవాట్లకు బానిస కావొద్దని సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌ సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ వయసు చాలా సున్నితమైందని, ఎక్కువ సమయం చదువుకునేందుకు కేటాయించాలని, మిగతా సమయంలో క్రీడలు, సాంస్కృతిక అంశాలపై దృష్టి సారించాలన్నారు. ర్యాగింగ్‌ వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అవకాశం లేకుండా అధ్యాపకులు బోధించే విషయాలపై శ్రద్ధ చూపాలని కోరారు. ర్యాగింగ్‌తో విద్యార్థులు మానసికంగా కుంగిపోతారని, అలాంటి పరిస్థితులు ఎవరికీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుశిక్ష ఉంటుందని, దీంతో జీవితం నాశనం అవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే వెంటనే కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, డయల్‌ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఈఓ సుదర్శన్‌రావు, న్యాయవాది లక్ష్మీపతిగౌడ్‌, అధ్యాపకులు రఘువీర్‌, దత్తాత్రేయ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

బాలసదనం, వృద్ధాశ్రమం తనిఖీ..

నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌ శనివారం పట్టణంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి, ఆహారం, రికార్డుల నిర్వహణ, హాజరుపట్టికలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎంతమంది వృద్ధులు, చిన్నారులు ఉన్నారనే వివరాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రోజూ తాజా కూరగాయలు, నాణ్యమైన బియ్యంతో ఆహారం సిద్ధం చేయాలని, తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. కార్యాలయ ఉత్తర్వుల ప్రకారమే అడ్మిషన్లు చేపడుతున్నారా, సంబంధిత వ్యక్తులకే పిల్లలు, వృద్దులను అప్పగిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. వృద్ధులు, చిన్నారులతో మాట్లాడి ఆరోగ్యం, అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement