నారాయణపేట: తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమురయ్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల భూమి, భుక్తి, విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేశారని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాం పాలనలో అణచివేతకు గురైన ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. ఆయన త్యాగం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని, యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాజేందర్‌గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
కొణిజేటి రోశయ్యకు నివాళి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య జయంతిని కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోశయ్యకు ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉందని, పరిపాలనలో చూపిన నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ ఖలీల్, డిప్యూటీ కలెక్టర్ రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


