‘కమలం’లో ముసలం! | - | Sakshi
Sakshi News home page

‘కమలం’లో ముసలం!

Mar 16 2026 8:49 AM | Updated on Mar 16 2026 8:49 AM

ఎంపీకి కొపమొచ్చిందా..? జోరుగా చర్చ..

ఇదీ కథ..

పేట బీజేపీ శ్రేణుల వ్యవహారశైలితో ఎంపీ డీకే అరుణకు కోపమొచ్చిందా అనే చర్చ కొనసాగుతోంది. మున్సిపల్‌ పీఠాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెడతామని ఎవరు చెప్పారు.. దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని పార్టీ పెద్దలకు ఎంపీ చురకలంటించినట్లు తెలుస్తోంది. ఎవరికి వారు తోచినట్లు చెబితే అధిష్టానం ఎందుకున్నట్లని మందలించినట్లు సమాచారం. పదవులు ఆశించడం తప్పు కాదు.. పెద్దలపై బురదజల్లడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. పార్టీ పెద్దల తీరు.. పలువురు కౌన్సిలర్లు తెర వెనుక మాట్లాడిన మాటలు జేజమ్మ చెవులో పడటంతో ఆమె గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సమయం ఇవ్వాలంటూ ఎంపీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, చైర్‌పర్సన్‌ భర్త సత్యయాదవ్‌ కోరగా.. పార్లమెంట్‌ సమావేశాల తర్వాత అని చెబుతుండటంతో ఒకింత అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ సమయం ఇచ్చిన తర్వాతే బాధ్యతలు చేపడతారా... లేక సమయం ముంచుకొస్తుందనే భావనతో ముందుకు వెళ్తారో వేచి చూడా లని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

నారాయణపేట: పట్టణ బీజేపీలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ శ్రేణులో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గ్రూపు రాజకీయాలు, కీలక నేతల పనితీరుతో పుర ఎన్నికల తర్వాత పార్టీలో మూడు ముక్కలాట మొదలైందనే చర్చ కొనసాగుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ సతీమణి కొండ శ్వేత పుర చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పార్టీలో నాయకుల మధ్య దూరం పెరుగుతుండగా ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముసలం చివరకు ఎటువైపు దారి తీస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

జిల్లాలోని కోస్గి, మక్తల్‌, మద్దూరు పురపాలికల్లో అధికార పార్టీ అభ్యర్థులు చైర్‌పర్సన్లుగా పదవీ బాధ్యతలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. కానీ నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ నుంచి చైర్‌పర్సన్‌గా కొండ శ్వేత ప్రమాణ స్వీకారం చేసి సోమవారానికి సరిగ్గా నెలరోజులు అవుతుంది. నేటి వరకు పదవీ బాధ్యతలు చేపట్టేందుకే పెద్దల ఆశీస్సులు దొరక్కపోవడం.. వాస్తు ప్రకారం చైర్‌పర్సన్‌ చాంబర్‌ను మార్చడంలో నిమగ్నమవడం.. ముహూర్తం కుదరకపోవడంతో అసలు పేట బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ కొనసాగుతోంది.

పుర చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికలో ఏం జరిగిందనే చర్చ నెలరోజులుగా వినిపిస్తోంది. ఫిబ్రవరి 16న ఉదయం 10 వరకు చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం తేల్చకపోవడం.. పార్టీ కౌన్సిలర్లు హైదరాబాద్‌ నుంచి నేరుగా ప్రత్యేక వాహనాల్లో జిల్లాకేంద్రం సమీపంలోని ద్వారక పాఠశాల ప్రత్యేక శిబిరానికి ఎంపీ డీకే అరుణ సమక్షంలో చేరుకోవడం వరకు బాగానే ఉంది. ఈ తర్వాత తాము చెప్పిన వారినే చైర్‌పర్సన్‌ ఎన్నుకుంటేనే చేతులు ఎత్తుతామని పలువురు కౌన్సిలర్లు ఎంపీ ఎదుట చెప్పడంతో ఆమెకు కోపమొచ్చినట్లుందని సమాచారం. పార్టీ అధిష్టానం ప్రకటించిన వారికి మద్దతు ఇవ్వాలిగాని.. మీరెలా నిర్ణయిస్తారంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదేం క్రమశిక్షణ అంటూ సీనియర్‌ నేతలతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీనియర్‌ నేతలతో పాటు కొందరు కౌన్సిలర్లు మంకుపట్టుతో చివరకు చేసేది లేక కొండ శ్వేతను చైర్‌పర్సన్‌గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 1వ వార్డు కౌన్సిలర్‌ సత్యరఘుపాల్‌రెడ్డికే వైస్‌ చైర్మన్‌ పదవి దక్కుతుందని ఊహించారు. కానీ చివరకు సత్యరఘుపాల్‌తోనే జి.రాఘవేందర్‌రెడ్డి సతమణి మంజుల పేరును ఎంపీ చెప్పించారు. చైర్‌పర్సన్‌ పదవి రాకపోయినా వైస్‌ చైర్మన్‌ పదవి వచ్చిందనే సంతృప్తిలో మంజుల రాఘవేందర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాణ స్వీకారం చేసి నెల

గడుస్తున్నా బాధ్యతలు

చేపట్టని పేట చైర్‌పర్సన్‌

అంతర్గత విభేదాలే

కారణమా?

పుర చైర్‌పర్సన్‌ పదవి తమ సతీమణికి ఇవ్వాలంటూ ఆశించిన వారిలో సత్యయాదవ్‌, రఘురామయ్యగౌడ్‌, రాఘవేందర్‌రెడ్డి, శ్యాంసుందర్‌గౌడ్‌ ఉన్నారు. కాగా గత మున్సిపల్‌ ఎన్నికల్లో సత్యయాదవ్‌ సతీమణి కొండ శ్వేతను చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. అయితే అప్పట్లో పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో కల నెరవేరలేదు. ఈ ఎన్నికల్లో 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందడం, 10వ వార్డులో బీజేపీ రెబల్‌గా పోటీచేసిన జయశ్రీ విజయం సాధించి తిరిగి పార్టీలో చేరడంతో సంఖ్య 12కు చేరింది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో నష్టపోయామని, తనకు ఈసారి అవకాశం ఇవ్వాలంటూ సత్యయాదవ్‌ పట్టుబట్టడంతో చివరకు పార్టీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కాగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి సత్యయాదవ్‌ను రాజీనామా చేయమంటారని ఒకనొక దశలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ పెద్దలు తనతో చర్చించ లేదని సత్యయాదవ్‌ చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement