● కర్ణాటక నుంచి గుట్టుగా దిగుమతి
● ఇటీవలే 100 క్వింటాళ్లు పట్టివేత
● రాత్రిళ్లు రైతులకు చేరవేత
మరికల్: పత్తి సాగుకు మరో నాలుగు నెలల సమ యం ఉండగానే నకిలీ పత్తి విత్తనాలు జిల్లాకు చేరుకున్నాయి. ఏటా అక్రమార్కుల ముఠా అధికారుల కళ్లుగప్పి రహస్యంగా నకిలీ పత్తి విత్తనాలతో పాటు ప్రమాదకర గ్‌లైకాసిన్ (గడ్డి నివారణకు పిచికారీ చేసే) మందులను ఇక్కడి వ్యాపారులకు చేర వేస్తున్నారు. కర్ణాటక సరిహద్దు జిల్లా కావడంతో రాత్రిళ్లు రహస్యంగా తీసుకొచ్చి నమ్మదగిన రైతుల పొలాల గడ్డివాములు, పశువుల కొట్టలు, భూమి ల్లో వీటిని భద్రపరుస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో సుమారు రూ.కోటి విలువజేసే వంద క్వింటాళ్ల నకిలీ విత్తనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
వర్షాధారమైన పత్తి పంటను జిల్లా రైతులు ఏటా 6 లక్షల ఎకరాలకుపైగా సాగు చేస్తారు. ఇందులో కొందరు ఫర్టిలైజర్ దుకాణాల్లో ప్యాకెట్లు కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు కిలోల చొప్పున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో సగానికి పైగా రైతులు నకిలీ విత్తనాలు నాటుతున్నట్లు సమాచారం. ఈ విత్తనాలు నాటిన రైతులు రాష్ట్రంలో నిషేధించిన గ్‌లైకాసిన్ గడ్డిమందును పిచికారీ చేస్తారు. ఈ మందు పిచికారీతో భవిష్యత్‌లో భూ మి నిర్జీవమయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


