పుర ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం
అమరచింత: పురపాలికల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలో కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచార రోడ్‌షోలో వారితో పాటు కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ మాదిరిగా కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించమని తెలిపారు. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడమే గాకుండా పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మక్తల్, ఆత్మకూర్, అమరచింత పురపాలికలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయ మన్నారు. అమరచింతలో సీపీఎం మద్దతుతో అధికారం చేపడతామని.. అమరచింత పీహెచ్‌సీని ఆధునికీకరించి నిరంతర వైద్యసేవలతో పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు..
మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ప్రజల్లో మత విధ్వేషాలు రెచ్చగొట్టడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చి రైతులు, రైతు కూలీలకు ఉపాధిని దూరం చేస్తోందని ఆరోపించారు. మతోన్మాద పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని కాంగ్రెస్‌పార్టీతో కలిసి పుర బరిలో నిలిచామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాభివృద్ధితో పాటు సమస్యలు పరిష్కరించుకునే వీలుందని వివరించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కత్తి వెంకటస్వామి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అయ్యూబ్‌ఖాన్, అరుణ్‌కుమార్, మహేందర్‌రెడ్డి, విష్ణు, లక్ష్మీకాంత్‌రెడ్డి, తౌఫిక్, సీపీఎం నాయకులు ఎండీ జబ్బార్, రమేష్, అజయ్, వెంకటేష్ పాల్గొన్నారు.


