మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
మద్దూరు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. మద్దూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలోనే 6 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. ఇందుకోసం పాత, కొత్త భవనాలను ఉపయోగించుకోవాలని కమిషనర్ శ్రీకాంత్‌ను ఆదేశించారు. అదే విధంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జూనియర్ కళాశాల భవనాన్ని అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ మహేశ్‌గౌడ్ ఉన్నారు.
ముంబై మారథాన్‌లో డీఎస్పీకి పతకాలు
నారాయణపేట: ముంబై మారథాన్ 2026లో జిల్లా నుంచి పాల్గొన్న డీసీఆర్‌బీ డీఎస్పీ మహేశ్ అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. టాటా ముంబై మారథాన్ (42.197 కి.మీ.) లాంగ్ రన్‌లో ఆయన పాల్గొని ఉత్తమ టైమింగ్ (5 గంటల 21 నిమిషాలు 30 సెకండ్లు)తో మారథాన్ విజయవంతంగా పూర్తిచేసి రెండు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్ ఆయనను మెడల్స్‌తో సత్కరించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధులతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభకనబరచడం డీఎస్పీ మహేశ్ ప్రత్యేకత అని అన్నారు. ఆయన సాధించిన విజయం యువత, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా డీఎస్పీ నల్లపు లింగయ్య డీసీఆర్‌బీ డీఎస్పీ మహేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అనాథలకు బాలసదన్ ఓ ఇల్లు: ఎంపీ
మహబూబ్‌నగర్ రూరల్: మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్ మెట్టుగడ్డలోని స్టేట్‌హోమ్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.34 కోట్ల నిధులతో బాలికల కోసం నూతనంగా నిర్మించిన బాలసదన్ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పడావో పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అనాథ పిల్లలకు బాలసదన్ ఒక ఇంటిలా మారుతుందని, ఇక్కడ వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా బాలికలు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, బాలసదన్‌ల ద్వారా వారికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్య పరీక్షలు, విద్య అందిస్తూ భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తున్నామని అన్నారు. అనాథ పిల్లల దత్తత ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తూ వారికి కొత్త కుటుంబాలు లభించేలా కృషి చేస్తున్న జిల్లా సంక్షేమశాఖ సిబ్బందిని ఎంపీ అభినందించారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి బాలసదన్‌లో చేర్చి, వారికి ఆహారం, ఆరోగ్యం, విద్య అందించి వారి స్వర్ణ భవిష్యత్‌కు బాటలు వేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ బాలసదన్‌లోని పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాలుగా సంరక్షణ అందించాలని ఆదేశించారు. అనంతరం జాతీ య బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ డీకే అరుణ బాలసదన్ పిల్లలతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామచంద్రం, శిశుగృహ మేనేజర్ గణేష్‌బాబు, బీజేపీ జాతీయ కౌన్సిల్‌మెంబర్ పద్మజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు


