ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

నారాయణపేట రూరల్‌: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం 15 పరీక్ష కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,922 మందికి గాను 4,750 మంది హాజరయ్యారు. జనరల్‌లో 4,425 మందికి గాను 4,274 మంది హాజరు కాగా.. 151 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 497 మందికి గాను 476 మంది హాజరై పరీక్షలు రాయగా.. 21మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేయగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు.

పెసర క్వింటా రూ.7,977

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం పెసర క్వింటా గరిష్టంగా రూ. 7,977, కనిష్టంగా రూ. 7,427 ధర పలికింది. వేరుశనగ గరిష్టంగా రూ. 8,169, కనిష్టంగా రూ. 5,940, జొన్నలు గరిష్టంగా రూ. 5,369, కనిష్టంగా రూ. 5,160, అలసందలు గరిష్టంగా రూ. 6,209, కనిష్టంగా రూ. 5,600, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,969, కనిష్టంగా రూ. 6,501, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,629, కనిష్టంగా రూ. 6,769 ధరలు పలికాయి.

తరగతి గదుల

పనుల్లో వేగం పెంచాలి

కోస్గి రూరల్‌: గుండుమాల్‌ మండలంలోని బోగారం ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. బోగారంలో సోమవారం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కడా నిధులతో చేపట్టిన తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించి.. పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోరుడ్రిల్లింగ్‌ను ప్రారంభించారు. కాగా, గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కడా ప్రత్యేకాధికారికి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ వేణుగోపాల్‌, సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ సాయప్ప, పంచాయతీ కార్యదర్శి అచ్యుత్‌, రాములు, రాఘవేందర్‌, మల్లయ్య ఉన్నారు.

భగీరథ నీటి సరఫరా

నిలిపివేత

నారాయణపేట ఎడ్యుకేషన్‌: మన్యంకొండ – నారాయణపేట మార్గంలో మిషన్‌ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతు కోసం 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు డి.శ్రీనివాస్‌ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. లీకేజీ కారణంగా దెబ్బతిన్న పైపు భాగాన్ని తొలగించి.. కొత్త పైపుతో భర్తీ చేసేందుకు గాను నీటి సరఫరా నిలిపివేతతో దేవరకద్ర, నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గంలోని మండలాలు ప్రభావితం కానున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

17, 18నయూనివర్సిటీల కన్వెన్షన్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్‌ పోస్టర్‌ను పీయూ వీసీ శ్రీనివాస్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కన్వెన్షన్‌కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్‌ రమేష్‌బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్‌సీ రవికుమార్‌, మధుసూదన్‌రెడ్డి, బెక్కం జనార్దన్‌, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్‌, భరత్‌, శేఖర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement