తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
● వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి ఏర్పడొద్దు
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. తాగునీటి వేసవి ప్రణాళికపై శనివారం కలెక్టరేట్‌లో డీఆర్డీఓ, డీపీఓ, మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు, ఏఈలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని గ్రామాల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలస్థాయిలో ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఏఈలతో కమిటీ వేసి వచ్చే నెల 1 నుంచి 20 వరకు గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా.. లేదా అనేది పరిశీలించాలన్నారు. సమస్య ఉన్న చోట స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని సూచించారు. మద్దూరు, కొత్తపల్లి, గుండుమల్, కోస్గి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కడా నుంచి నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో తాగునీటి పైపులైన్ల మరమ్మతు ఇతర పనులకు పంచాయతీ నిధులు లేదా జనరల్ ఫండ్, ఎస్‌ఎఫ్‌సీ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. వేసవిలో ఏ ఒక్క పంచాయతీలో తాగునీటి సమస్య ఉందనే ఫిర్యాదులు రావొద్దన్నారు. కాగా, జలశక్తి అభియాన్ అమలు తీరు జిల్లాలో సంతృప్తిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే నారాయణపేట 31వ స్థానంలో ఉందని, వచ్చే నెల వరకు జిల్లా ర్యాంకింగ్ పెంచాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్, ఈఈలు రంగారావు, శ్రీనివాస్ ఉన్నారు.
● ఆలిండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విలేజ్ విసిట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్‌మెంట్ స్కీం సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎంపికచేసిన ఊట్కూర్, దామరగిద్ద, నారాయణపేట మండలం సింగారం, మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీల్లో ఆలిండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ బృందం సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా 29 నుంచి 31వ తేదీ వరకు నారాయణపేట మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. సర్వేకు నోడల్ అధికారిగా డీఆర్డీఓ మొగులప్ప వ్యవహరిస్తారన్నారు.
బాలికా సాధికారత సాధిద్దాం..
జిల్లాలో బాలికా సాధికారత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి.. వారిని అన్నివిధాలుగా ప్రోత్సహించాలన్నారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నారాయణపేటను మార్చాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జి సంక్షేమశాఖ అధికారి రాజేందర్‌గౌడ్, డీపీఆర్‌ఓ రషీద్, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్టులు అనిత, నర్సింహ, ఇన్‌చార్జి డీసీపీ కరిష్మా, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ నర్సింహులు, తిరుపతయ్య, వెంకట్, సాయి పాల్గొన్నారు.


