రూ.1,035 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
మక్తల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే రూ. 1,035 కోట్లతో మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్‌లో పట్టణంలోని 1, 11, 14 వార్డుల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అంతకుముందు పలు కాలనీల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు మక్తల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. తాను మంత్రి పదవి చేపట్టిన కొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో రూ.కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. మక్తల్‌లో తాగునీటి సమస్య తలెత్తకుండా రూ. 80లక్షలతో పైపులైన్ నిర్మిస్తున్నట్లు చెప్పా రు. 1, 11, 14 వార్డుల్లో రూ. 2.50కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటి స్తూ.. త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో నిధుల కొరత లేదని.. అభివృద్ధి కార్యక్రమాలకు వెనకాడేదిలేదని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్‌కుమార్‌రెడ్డి, ఏఈ నాగశివ, గోవర్ధన్, కట్టా సురేశ్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషొద్దీన్, ఎండీ సలాం, భాస్కర్ పాల్గొన్నారు.


